global debt: 164 లక్షల కోట్ల డాలర్లకు చేరిన ప్రపంచం రుణ భారం... మరో సంక్షోభం వస్తే కష్టమే: ఐఎంఎఫ్ హెచ్చరిక

  • ప్రతికూలతలు ఎదురైతే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది
  • ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిక
  • చైనాలో అధికంగా ప్రైవేటు రుణాలు

ఈ ప్రపంచం అప్పుల కుప్పగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వ, ప్రైవేటు రుణాలు రికార్డు స్థాయి 164 లక్షల కోట్ల డాలర్లకు చేరాయి. ఈ ధోరణి చూస్తుంటే మరో సంక్షోభం వస్తే ఎదుర్కోవడం కష్టతరం అవుతుందని, పరిస్థితులు కఠినంగా మారితే రుణాలు తిరిగి చెల్లించడం భారంగా మారుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది.

2016నాటికి ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ) కంటే ఎక్కువగా రుణాలు 225 శాతానికి చేరాయని ఐఎంఎఫ్ గతేడాదే హెచ్చరించింది. 164 లక్షల కోట్ల డాలర్లు అనేది చాలా పెద్ద సంఖ్య అని, ప్రభుత్వ, ప్రైవేటు రుణ భారం గరిష్ట స్థాయికి చేరిందని ఐఎంఎఫ్ ద్రవ్య వ్యవహారాల హెడ్ విటోర్ గాస్పర్ అన్నారు. చైనాలో ప్రైవేటు రుణాలు బాగా పెరిగిపోయాయని, ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ప్రైవేటు రుణాల్లో మూడొంతుల వాటా ఈ దేశంలోనే ఉందని ఐఎంఎఫ్ తెలిపింది.

తారస్థాయికి చేరిన రుణ భారం వల్ల అవి గడువు తీరే సమయానికి చెల్లింపులు చేయడం ప్రభుత్వాలకు కష్టంగా మారుతుందని హెచ్చరించింది. ఆర్థిక సంక్షోభంలోకి వెళితే ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంది.

More Telugu News