Balakrishna: బాలకృష్ణపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

  • గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మాధవ్, విష్ణుకుమార్ రాజు 
  • చంద్రబాబు సమక్షంలోనే అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం
  • బాబు, బాలకృష్ణ పైనా చర్యలు తీసుకోవాలని కోరాం

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణపై గవర్నర్ నరసింహన్ కు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఉదయం నరసింహన్ ను వారు కలుసుకున్నారు. గవర్నర్ నరసింహన్ ను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ కలిశారు. మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం, మీడియాతో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, బాలకృష్ణపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా అంగీకరించిన చంద్రబాబుపైనా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.

బాలకృష్ణపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరాం

నిన్న జరిగిన వ్యవహారం గురించి గవర్నర్ కు పూర్తిగా వివరించడం జరిగిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. మోదీపై దారుణంగా బాలకృష్ణ మాట్లాడారని, పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని వారించడం కానీ, ఖండించడం కానీ చేయకపోవడం సబబు కాదని అన్నారు. బాలకృష్ణపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నరసింహన్ ను కోరామని, ఆయన సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం తమకు ఉందని చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి కూడా ఆయన వద్ద ప్రస్తావించామని అన్నారు. మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను చెప్పేందుకు కూడా తమకు నోరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా గతంలో నారా లోకేశ్ పై మెస్సేజ్ లు, వార్తలు వస్తే.. అవి రాసిన వారిని జైలుకు పంపించారని, మరి, మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం అనేది ఈ రాష్ట్రంలోనే జరుగుతోందని విమర్శించారు.  

More Telugu News