IPL-2018: వాట్సన్ చెలరేగిన వేళ... చేష్టలుడిగిన రాజస్థాన్!

  • పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన షేన్ వాట్సన్
  • సెంచరీతో రెచ్చిపోయిన వైనం
  • 51 బంతుల్లోనే మూడంకెల స్కోరు
  • 64 పరుగుల తేడాతో ఆర్ఆర్ భారీ ఓటమి

ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాని పరిస్థితిలో కనీస రేటుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీకి అమ్ముడై, తనలో సత్తా ఇంకా చావలేదని నిరూపిస్తున్న క్రిస్ గేల్ ను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో... ఎలాంటి అంచనాలు లేకుండా చెన్నై తరఫున ఆడుతున్న షేన్ వాట్సన్ చెలరేగిపోయాడు. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పోటీ పడగా, 51 బంతుల్లోనే సెంచరీ చేయడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 204 పరుగులు చేసింది. వాట్సన్ 106 పరుగులు చేయగా, రైనా 49 పరుగులతో రాణించాడు.

ఇక 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన రాజస్థాన్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు. రెండో ఓవర్లోనే వికెట్ల పతనం ప్రారంభం కాగా, 45 పరుగులు చేసిన స్టోక్స్ అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పరాజయం ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ లో 64 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ ఓడిపోగా, షేన్ వాట్సన్ కు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, నేడు సాయంత్రం 4 గంటలకు కోల్ కతా, పంజాబ్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో ఆపై రాత్రి 8 గంటల నుంచి బెంగళూరులో ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ లు సాగనున్నాయి.

More Telugu News