krishnapatnam port: ఎగుమతి, దిగుమతుల్లో రికార్డు సృష్టించిన కృష్ణపట్నం పోర్టు: సీఈవో అనిల్

  • కంటైనర్ల హ్యాండ్లింగ్‌లో రికార్డు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో 88 శాతం పెరిగిన ఎగుమతి దిగుమతులు
  • కృష్ణపట్నం‌ నుంచి నేరుగా బంగ్లాదేశ్‌కు సరుకు రవాణా

కంటైనర్ల హ్యాండ్లింగ్‌లో కృష్ణపట్నం పోర్టు రికార్డులు తిరగరాస్తోందని పోర్టు డైరెక్టర్, సీఈవో అనిల్ ఎండ్లూరి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 4,81,408 కంటైనర్లను పోర్టు హ్యాండిల్ చేసిందని, 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 88 శాతం అధికమని ఆయన వివరించారు. ఎగుమతి, దిగుమతుల్లో పోర్టు రికార్డు సృష్టించిందని, దేశంలోని మరే పోర్టులోనూ కంటైనర్ల హ్యాండ్లింగ్ ఈ స్థాయిలో పెరగలేదని తెలిపారు.

కృష్ణపట్నం పోర్టు ద్వారా గతేడాది 4.5 కోట్ల టన్నుల సరుకుల ఎగుమతి, దిగుమతులు జరిగాయన్నారు. గతంలో కొలంబో పోర్టు ద్వారా బంగ్లాదేశ్‌కు ఏపీ నుంచి మిర్చి, పత్తి ఎగుమతులు జరిగేవని, కానీ ఇప్పుడు ఈ రేవు నుంచి నేరుగా బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్‌కు సరుకులను ఎగుమతి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇక బందరు పోర్టు నిర్మాణం కూడా పూర్తయితే తెలంగాణ, మధ్య ఆంధ్రాకు ఎగుమతి, దిగుమతులు మరింత దగ్గరవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ (కెపీసీటీ) డైరెక్టర్‌ వినీత వెంకటేష్‌ మాట్లాడుతూ.. కృష్ణపట్నం పోర్టుకు హైదరాబాద్‌ అత్యంత కీలక మార్కెట్‌ అని పేర్కొన్నారు. ముంబైలోని జేఎన్‌పీటీ పోర్టు కంటే తెలంగాణకు కృష్ణపట్నం పోర్టు 200 కిలోమీటర్ల తక్కువ దూరంలో ఉందని, కాబట్టి బోల్డంత సమయం, రవాణా ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు. తెలంగాణలోని ఎగుమతి దారుల కోసం ప్రత్యేకంగా ‘ఓషన్ టు డోర్’ పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెంకటేష్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో రేవు వార్షిక సరుకుల ఎగుమతి, దిగుమతుల సామర్థ్యాన్ని 8 కోట్ల నుంచి 10 కోట్ల టన్నులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఈవో అనిల్ తెలిపారు.

More Telugu News