journalists: మీడియాలోనూ క్యాస్టింగ్ కౌచ్?.. దుమారం రేపుతున్న తమిళనాడు బీజేపీ నేత వ్యాఖ్యలు

  • మీడియాపైన, రిపోర్టర్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత
  • దుమారం రేగడంతో దిగివచ్చిన వైనం
  • తాను రాయలేదని, ఆ పోస్టు తనది కాదని వివరణ

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తుంటే.. మరోవైపు తమిళనాడుకు చెందిన బీజేపీ నేత, నటుడు ఎస్వీ శేఖర్ షేర్ చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది.  మీడియాలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న ఆయన.. పెద్ద మనుషులతో పడుకోకుండా ఎవరూ రిపోర్టర్లు, యాంకర్లు కాలేరంటూ ఆ పోస్టులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థల్లో కంటే మీడియాలోనే లైంగిక వేధింపులు ఎక్కువన్న ఆయన అక్షరం ముక్క రాని దుర్మార్గులు మీడియాలో ఉన్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

సీనియర్ జర్నలిస్టు లక్ష్మీ సుబ్రహ్మణ్యంను తాకినందుకు గవర్నర్ పురోహిత్ తన చేతిని ఫినాయిల్‌తో కడుక్కోవాలన్న శేఖర్.. రాష్ట్రంలో నేరస్తులు, నీచులు, బ్లాక్ మెయిలర్ల చేతుల్లో మీడియా చిక్కుకుని విలవిల్లాడుతోందన్నారు. ఇక్కడి మీడియా ప్రతినిధులు సభ్యత తెలియని నీచులని మండిపడ్డారు. అయితే ఈ పోస్టులపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన దిగి వచ్చారు. దానిని తాను చదవకుండానే షేర్ చేశానని, క్షమించాలని వేడుకున్నారు. ఆ పోస్టును తాను రాయలేదని, ఎవరో చేసిన దానిని తాను షేర్ మాత్రమే చేశానని వివరణ ఇచ్చారు.

More Telugu News