Andhra Pradesh: పుట్టినరోజున నిరాహార దీక్ష చేయాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు: సీఎం చంద్రబాబు

  • ఏపీ ముఖ్యమంత్రిగా నేను ఈ దీక్ష చేశాను
  • కొన్ని రాజకీయ పార్టీలు రాలేదు..వారి అజెండా వేరుగా ఉంది
  • ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రాన్ని నిలదీస్తున్నా
  • ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యరు?

తన పుట్టినరోజు నాడు ఈ దీక్ష చేయాల్సి వస్తోందని ఎప్పుడూ ఊహించలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ధర్మపోరాట దీక్ష విరమించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, అన్ని మతాల వారు ఈ దీక్షా శిబిరానికి వచ్చి తనను ఆశీర్వదించారని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అందరూ పెద్దఎత్తున దీక్షలు చేశారని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అందరూ నినదించారని, ఏపీ ముఖ్యమంత్రిగా తాను ఈ దీక్ష చేశానని చెప్పారు.

కొన్ని రాజకీయ పార్టీలు రాలేదని, వారి అజెండా వేరుగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున, ఐదు కోట్ల ప్రజల తరపున కేంద్రాన్ని అడుగుతున్నా .. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను, ముఖ్యంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రాన్ని నిలదీస్తున్నానని, డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఈ హామీలను అమలు చెయ్యరా? అని అడుగుతున్నానని, ఒకవేళ చెయ్యకపోతే ఎందుకు చెయ్యరు? అని ప్రశ్నిస్తున్నానని అన్నారు.

 ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది జూన్ 2న, నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసింది మే 26న. ఆనాటి నాయకులతో నేను ఒకటే మాట చెప్పాను, ‘పోలవరం పరిసరాల్లోని 7 మండలాలు మాకు ఇస్తామని.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని గ్యారంటీ ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చెయ్యనని, ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని ఆరోజే చెప్పాను’ అని అన్నారు.

More Telugu News