Andhra Pradesh: మహా భారతంలో ఒక్కడే శిఖండి.. ఏపీలో మాత్రం ఇద్దరు ఉన్నారు: హీరో శివాజీ

  • వారెవరో మీరు చెప్పలగరా?
  • నేను చెప్పలేను
  • ఈ మధ్య వారు ప్రశాంతంగా రిటైరైపోయారు
  • ఈ ఇద్దరు శిఖండులు రాజధానిపై ఆరోపణలు చేస్తున్నారు

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై పోరాడేందుకు ముందుకు రాలేదు కాబట్టి ఏపీలో పలుసార్లు బంద్‌కు పిలుపునిచ్చామని, ఇప్పుడు అధికార పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ముందుకు వచ్చిందని ఇక మనం ఢిల్లీలో నిరసనలు తెలపాల్సి ఉందని సినీనటుడు శివాజీ అన్నారు. ఈ రోజు విజయవాడలో జరుగుతున్న ధర్మపోరాట దీక్ష చేస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేంద్ర సర్కారుకి కనువిప్పు కలిగేలా పోరాటం చేద్దామని అన్నారు. ప్రతి ఊరిలో రైలు ట్రాక్స్ పై కూర్చొని ఆందోళన చేద్దామని, ప్రతి ఊరిలో పట్టాల వద్ద ఎర్రజెండా పాతితే రైళ్లు ఆగిపోతాయని అన్నారు. అలాగే, బీజేపీ నిర్వహిస్తోన్న ఆపరేషన్ గరుడ ఇంకా ఆగలేదని, రాష్ట్రంపై కుట్రలు పన్నాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏదో ఒక రూపంలో రాష్ట్రాన్ని ఒత్తిడికి గురిచేసి హోదా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. ఓ వైపు అమరావతిలో రాజధాని కోసం మన రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు త్యాగం చేస్తే మరికొందరు ఆ విషయాన్ని కూడా విమర్శిస్తున్నారని అన్నారు.

"మహా భారతంలో ఒక్కడే శిఖండి.. కానీ ఇక్కడ ఇద్దరు శిఖండులు తయారయ్యారు. నేను పేర్లు చెప్పను.. మీరు చెప్పలగరా ఎవరన్నా.. నేను చెప్పలేను.. ఈ మధ్య ప్రశాంతంగా రిటైరైపోయారు ఈ ఇద్దరు శిఖండులు. రాజధానిపై ఆరోపణలు చేస్తున్నారు. వారిద్దరికీ ఈ నెలాఖరుకి సరైన సమాధానం చెబుతాను. వారిద్దరితో పాటు ఇంకొంత మంది నాయకులు కూడా జాతీయ పార్టీతో కలిసి కుట్రలు చేస్తున్నారు. వారి విషయాలు కూడా బయటపెడతాను" అని శివాజీ అన్నారు. 

More Telugu News