Balakrishna: నేరచరిత్ర ఉన్న బాలకృష్ణా! ఈరోజు రాత్రి 7 గంటల్లోగా క్షమాపణలు చెప్పు!: బీజేపీ నేతల డిమాండ్

  • ప్రధానిపై బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం
  • క్షమాపణలు చెప్పకపోతే మా ప్రతి స్పందన మరోలా ఉంటుంది
  • రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా బాలకృష్ణను అడ్డుకుంటాం
  • బాలకృష్ణపై మండిపడ్డ విష్ణుకుమార్ రాజు, మాధవ్

ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ ఒక ద్రోహి అని, కొట్టి కొట్టి తరుముతామని, బంకర్ లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతామంటూ ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దారుణమంటూ బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఈరోజు రాత్రి ఏడు గంటల్లోగా బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో తమ ప్రతి స్పందన మరోలా ఉంటుందని, రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా బాలకృష్ణను అడ్డుకుంటామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్ప వేదికపై ఉండగానే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారని, నేరచరిత్ర ఉన్న బాలకృష్ణ ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. చంద్రబాబు చేస్తోంది ధర్మపోరాట దీక్ష కాదని, అధర్మపోరాట దీక్ష అని, కనీసం, పుట్టినరోజు నాడైనా చంద్రబాబు నిజాలు మాట్లాడితే మంచిదని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

అనంతరం, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, వచ్చీరాని హిందీ భాషలో మోదీపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ అనుచితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హోం మంత్రి, పోలీసుల సమక్షంలోనే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారని, వెంటనే అరెస్టు చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు.

More Telugu News