krishnam raju: ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు: కృష్ణంరాజు

  • గతంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నా
  • చిన్న తప్పుకు మొత్తం వ్యవస్థను తప్పు పట్టవద్దు
  • మోదీ దీక్షను విమర్శించిన చంద్రబాబు... ఇప్పుడు దీక్ష ఎలా చేస్తారు?

సినీ పరిశ్రమలోకి క్యాస్టింగ్ కౌచ్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదని... గతంలో కూడా దీని గురించి విన్నామని నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే లేదని... అన్ని చోట్లా ఉందని అన్నారు. విమర్శించడానికి సినీ పరిశ్రమే దొరికిందా? అని ప్రశ్నించారు. ఎక్కడో తప్పు జరిగిందని... మొత్తం వ్యవస్థనే తప్పుబట్టడం దారుణమని అన్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్నది తెల్ల పేపర్ పై ఒక మచ్చ వంటిదని... త్వరలోనే ఆ మచ్చను తొలగిస్తామని చెప్పారు.

రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని కృష్ణంరాజు అన్నారు. మోదీ దీక్ష చేసినప్పుడు విమర్శించిన చంద్రబాబు... ఇప్పుడు ఎలా దీక్ష చేస్తారని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంతో చేస్తోందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని, ఇప్పుడు మాట మార్చడం దారుణమని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయని దుయ్యబట్టారు.  

More Telugu News