ZTE: అమెరికా నిషేధంపై మండిపడ్డ చైనా కంపెనీ జెడ్ టీఈ.... కంపెనీ మనుగడకే ముప్పు అంటూ ఆగ్రహం

  • ఈ చర్య అన్యాయం
  • అమెరికా కంపెనీల ప్రయోజనాలపైనా ప్రభావం
  • చట్టపరంగా ఎదుర్కొంటామని ప్రకటన

చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తులు, టెలికం ఉపకరణాల సంస్థ జెడ్ టీఈ కార్పొరేషన్ కు అమెరికా కంపెనీలు సాఫ్ట్ వేర్, ఇతర ఉత్పత్తుల విక్రయాలు చేయకుండా ట్రంప్ సర్కారు ఏడేళ్ల పాటు నిషేధం విధించడంతో బాధిత కంపెనీ స్పందించింది. ఇది అనుచితమని, తమ మనుగడకే ముప్పుగా జెడ్ టీఈ అభివర్ణించింది. చట్టపరంగా తమ ప్రయోజనాల పరిరక్షణకు పోరాడతామని పేర్కొంది.

తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ జెడ్ టీఈపై అమెరికా ఈ చర్య తీసుకుంది. ఇది పూర్తిగా అన్యాయమని, తమకు ఆమోదనీయం కాదని జెడ్ టీఈ పేర్కొంది. ఈ నిషేధం వల్ల తమ ప్రయోజనాలకు మాత్రమే కాకుండా తమతో భాగస్వామ్యం కలిగిన అమెరికా కంపెనీల ప్రయోజనాలకూ భంగకరమని తెలిపింది. కాగా, ఈ నిషేధం అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు నెలకొన్న సమయంలో చోటు చేసుకోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News