flipkart: సొంత స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో చతికిలపడిన ఫ్లిప్ కార్ట్, అమేజాన్

  • ఫ్లిప్ కార్ట్ నుంచి బిలియన్ క్యాప్చర్ బ్రాండ్ పై ఫోన్ల విక్రయాలు
  • అమేజాన్ నుంచి టెనార్ బ్రాండ్ పేరుతో ఫోన్లు
  • విక్రయాల్లో టెనార్ కాస్త మెరుగు
  • అయినా మొత్తం విక్రయాల్లో వీటి వాటా చాలా స్వల్పం

కోట్లాది స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటే, ఈ ట్రెండ్ ను క్యాష్ చేసుకుందామని సొంత బ్రాండ్లపై స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లక్ష్యంలో చతికిలపడ్డాయి. కస్టమర్లను ఆకర్షించలేకపోయాయి. ఫ్లిప్ కార్ట్ బిలియన్ క్యాప్చర్ బ్రాండ్ పేరుపై స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు మొదలు పెట్టగా, అమేజాన్ టెనార్ పేరుతో విక్రయాలు చేపట్టింది.  

 ఒక్క డిసెంబర్ మాసంలోనే ఫ్లిప్ కార్ట్, అమేజాన్ తమ ప్లాట్ ఫామ్ లపై వివిధ రకాల బ్రాండ్లకు చెందిన సుమారు 15 లక్షల ఫోన్ల విక్రయాలను నమోదు చేశాయి. కానీ, సొంత బ్రాండ్ల విక్రయాలు మాత్రం వీటిలో చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు. దీంతో కస్టమర్ల ఆదరణ చూరగొనడంలో వైఫల్యం చెందినట్టు తెలుస్తోంది.

ఫ్లిప్ కార్ట్ కేవలం 20,000 ఫోన్లనే విక్రయించగా, అమేజాన్ టెనార్ మాత్రం దీని కంటే మెరుగ్గా ఉంది. 2,50,000 ఫోన్లను అమ్ముకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ తన వ్యూహాలను మార్చుకునే పనిలో పడింది. మరోవైపు దేశీయంగా షియోమీ, శామ్ సంగ్ గరిష్ట మార్కెట్ వాటాతో బలమైన కంపెనీలుగా ఉన్నాయి.

More Telugu News