Chandrababu: చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం.. దీక్షకు పోటెత్తిన అభిమానులు, కార్యకర్తలు

  • చంద్రబాబు మెడలో పూలమాల వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు శివరామకృష్ణ
  • ఆశీర్వదించిన టీటీడీ వేదపండితులు
  • సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగనున్న దీక్ష
  • రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల సంఘీభావ దీక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ధర్మ పోరాట దీక్ష ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగనుంది. చంద్రబాబు దీక్షకు పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. చంద్రబాబు దీక్షకు మద్దతుగా 13 జిల్లాల్లోనూ మంత్రులు దీక్షలు చేపట్టారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై సమర శంఖం పూరించిన చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు కూర్చున్నారు. దీక్షా వేదికకు ఇరువైపులా మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఇటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.

అశేష అభిమానుల మధ్య దీక్ష వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ..’ పాటతో దీక్ష ప్రారంభమైంది. స్వాతంత్య్ర సమరయోధుడు శివరామకృష్ణ.. చంద్రబాబు మెడలో పూలమాల వేసి ఆశీర్వదించారు. అనంతరం టీటీడీ వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. సర్వమత ప్రార్థనలు జరిగాయి.  చంద్రబాబు వెంట రాష్ట్రమంత్రులు, ఎంపీలు ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది.

More Telugu News