allu aravind: వర్మ వెనుక ఎవరున్నారు? నీచుడు ఆర్జీవీని ఇక ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తారు?: అల్లు అరవింద్‌ తీవ్ర ఆగ్రహం

  • వర్మ ఇంట్లో వారిని ఎవరైనా అలా తిడితే ఆయన ఎంతగా బాధపడతాడు!
  • అటువంటి నీచత్వం మాకు లేదు
  • వర్మ ఇటువంటి నీచమైన మనస్తత్వం కలవాడు
  • ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో సినీ ఇండస్ట్రీ చెప్పాలి

యువనటి శ్రీరెడ్డితో సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ని తిట్టించిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై నిర్మాత అల్లు అరవింద్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... "రాత్రి ఒక వీడియో చూశాను.. వీడియో చూడడానికి ముందు మా ఫ్యామిలీలోని ఓ హీరోతో, ఇతర ఇద్దరు దర్శకులతో మాట్లాడాను.. మహిళలు కొంతమంది ఆరోపణలు చేస్తుండడంతో సినీ పరిశ్రలోని పెద్దలు కృంగిపోతున్నారు.. అందరూ బాధపడుతున్నారు.

ఇక గత రాత్రి వర్మ వీడియోలో పలు విషయాలు చెప్పారు. వర్మ గారూ అని నేను అనను.. మీపై గౌరవం లేదు, మిస్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ... ఒక బూతు మాట, చాలా చెండాలపు పదాన్ని శ్రీరెడ్డితో అనిపించానని, పవన్ కల్యాణ్‌ను తిట్టించానని చెప్పారు.
 
వర్మ చివరకు సారీ అంటున్నారు.. పవన్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. శ్రీరెడ్డి చేయాలనుకున్న నిరసనను ఆమె చేయొచ్చు. కానీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయమని వర్మ చెప్పారు. అసభ్యకరంగా పదజాలం వాడుతూ, వేలు చూపించాలని చెప్పారు. రామ్‌ గోపాల్‌ వర్మ చుట్టూ ఒక నీచపు వర్గం కూడా ఉంది.

అదే వీడియోలో దగ్గుబాటి సురేశ్‌ ఫ్యామిలీ నుంచి రూ.5 కోట్లు ఇప్పిస్తానని వర్మ అన్నారు. పవన్ కల్యాణ్‌పై చేసిన ఈ కుట్రల వెనుక వర్మ వెనుక కూడా ఇంకా ఎవరు ఉన్నారు? అనేక సందేహాలతో నాకు రాత్రి నిద్రపట్టలేదు. ఒక మనిషి సమాజంలో పేరు తెచ్చుకుంటుంటే అతడి పేరును ఎలా తగ్గించాలని కుట్రలు పన్నుతున్నారు. అలాగే పవన్‌ కల్యాణ్‌పై వర్మకి ఉన్న కోపాన్ని శ్రీరెడ్డితో తీర్చుకోవాలని చూశారు.

వర్మ... నీ తల్లినో, భార్యనో, కూతురిపైనో అటువంటి పదాలు వాడితే నీవు ఎంతగా బాధపడతావు? అటువంటి నీచత్వం మాకు లేదు. నీవు ఇటువంటి నీచమైన మనస్తత్వం కలవాడివని అందరికీ తెలుసు. రామ్‌ గోపాల్‌ వర్మే తనతో ఇలా చేయించాడని శ్రీరెడ్డి చెప్పే లోపల కావాలనే వర్మ ఆ వీడియోలో నిజాలు చెప్పాడు. ఇండస్ట్రీలోని ఓ కుటుంబంపై నీకు బాధ్యత ఉందని దగ్గుబాటి సురేశ్ కుటుంబాన్ని కాపాడాలని రూ.5 కోట్లతో డీల్‌ చేయాలని అనుకున్నానని వర్మ అన్నాడు. మరి మెగా కుటుంబం కూడా ఇండస్ట్రీకి చెందిందే కదా? ఈ కుటుంబంపై మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తావా? ఇండస్ట్రీలోని కుటుంబంపై నీకు అంత జాగ్రత్త ఉందా?
 
టాలీవుడ్ ఇండస్ట్రీ నిన్ను పైకి తీసుకొచ్చింది. నాగార్జునతో మొదటి సినిమా తీశావు. అటువంటి ఇండస్ట్రీకి ఎందుకు ద్రోహం చేశావు? ఒక క్రైమ్ చేయడానికి ప్లాన్‌ చేసినట్లు చేశారు. తడిగుడ్డతో గొంతు కోసే రకంగా వర్మ ప్రవర్తిస్తున్నాడు. దీని వెనుక వర్మ పాత్ర ఉందని రుజువైంది. ఈ ఇష్యూని ఇండస్ట్రీ ఏం చేస్తుందనేది కాకుండా ఇటువంటి వర్మలాంటి నీచుడిని ఏం చేస్తారో చెప్పమని నేను ఇండస్ట్రీ పెద్దలని డిమాండ్ చేస్తున్నాను. ఇటువంటి నీచుడు ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి?" అని అల్లు అరవింద్‌ ఆగ్రహంగా ప్రశ్నించారు.

More Telugu News