మెగాహీరో న్యూ మూవీ షూటింగ్ మొదలైంది!

19-04-2018 Thu 13:46
  • సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ 
  • కథానాయికలుగా లావణ్య .. అదితీరావు 
  • అంతరిక్షం నేపథ్యంలో కథ
వరుసగా రెండు హిట్లు కొట్టేసిన వరుణ్ తేజ్ .. మూడవ సినిమాగా ప్రయోగాత్మక చిత్రం చేయబోతున్నాడు. 'ఘాజీ' సినిమాను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ రోజున నిర్వహించారు. దర్శక నిర్మాతలతో పాటు .. కథానాయికలు లావణ్య త్రిపాఠి .. అదితీరావు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

 వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయిక కాగా, ఓ కీలకమైన పాత్రను అదితీరావు చేయనుందని అంటున్నారు.  హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో స్పేస్ సెంటర్ సెట్ వేసి .. చాలావరకూ అక్కడే షూటింగ్ జరపనున్నారు. తెలుగులో ఇంతవరకూ అంతరిక్షం నేపథ్యంలో సినిమా రాలేదు. తొలిసారిగా ఈ సినిమా ఆ నేపథ్యంతో రూపొందుతుండటం విశేషం.