chintamaneni prabhakar: ఎమ్మెల్యే చింతమనేనిపై చంద్రబాబు ఆగ్రహం.. వచ్చి కలవాలంటూ ఆదేశం!

  • పోస్టర్ లో చంద్రబాబు ముఖాన్ని చింపేయడంపై చింతమనేని ఆగ్రహం
  • డ్రైవర్, కండక్టర్ లపై మండిపాటు
  • ప్రశ్నించిన స్థానికుడిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలవాలంటూ ఆయన ఆదేశించారు. హనుమాన్ జంక్షన్ లో మంగళవారం చోటు చేసుకున్న ఓ ఘటనే దీనికి కారణం. ఓ ఆర్టీసీ బస్సుపై ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఉన్న ఓ చిత్రంపై చంద్రబాబు ముఖాన్ని ఎవరో చించేశారు. దీన్ని గమనించిన చింతమనేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే బస్సును అక్కడే నిలిపివేసి డ్రైవర్, కండక్టర్లను పిలిచి దుర్భాషలాడారు. ప్రయాణికుల్ని కూడా కిందకు దించేసి, వేరే బస్సులోకి ఎక్కించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా, గరికపాటి నాగేశ్వరరావు అనే స్థానికుడు ప్రశ్నించే ప్రయత్నం చేయగా, అతనిపై చింతమనేని చేయి చేసుకున్నారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హనుమాన్ జంక్షన్ లో నిరసన కార్యక్రమం చేపట్టింది. వీరికి వైకాపా మద్దతు పలికింది. తమను దుర్భాషలాడారంటూ చింతమనేనిపై ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, చింతమనేనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆయన మండిపడ్డారు. వచ్చి తనను కలవాలంటూ ఆదేశించారు.

More Telugu News