rape: మన కుమార్తెలను దోచుకుంటే ఎలా సహిస్తాం...? వీటిని రాజకీయం చేయకండి: ప్రధాని మోదీ

  • అత్యాచారం ఎప్పుడు జరిగినా అది బాధాకరమే
  • దీనికి పాల్పడుతున్నది మరొకరి కుమారుడన్న విషయం గుర్తుంచుకోవాలి
  • పరిష్కారానికి కఠిన విధానం అంటూ ఉండదని వ్యాఖ్యలు
  • ఇంటికి ఆలస్యంగా వస్తే తనయులను కూడా ప్రశ్నించాలని సూచన

జమ్మూ కశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం, యూపీలోని ఉన్నావోలో 17ఏళ్ల యువతిపై దారుణ అత్యాచారంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో ప్రధాని మోదీ స్పందించారు. లండన్ లో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ‘‘అత్యాచారం అనేది అత్యాచారమే. మన కుమార్తెలను ఈ విధంగా దోచుకుంటుంటే ఎలా సహిస్తాం? అయితే, అత్యాచారాలను భిన్న ప్రభుత్వాల కాలాలతో పోల్చి చూడాలి. అంటే మీ హయాంలో ఎక్కువ, మా హయాంలో ఎక్కువ అన్నది నా ఉద్దేశ్యం కాదు.

ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చాలా కఠిన విధానం అంటూ ఉండదు. అత్యాచారం అనేది ఇప్పుడు జరిగినా, గతంలో జరిగినా అది బాధాకరమే. అత్యాచార ఘటనలను రాజకీయం చేయవద్దు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ పాపానికి ఒడిగట్టే వ్యక్తి మరొకరి కుమారుడన్న విషయాన్ని కూడా గుర్తించాలన్నారు. ‘‘కుమార్తె ఇంటికి ఆలస్యంగా వస్తే ఎందుకు ఆలస్యమైంది? ఎక్కడికి వెళ్లావు? ఎవరిని కలిశావు? వంటి ప్రశ్నలు వేస్తాం. ప్రతి ఒక్కరు తమ కుమార్తెలను ఇలానే అడుగుతారు. కానీ, కుమారులను కూడా ఇదే విధంగా ప్రశ్నించాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు.

More Telugu News