Jammu And Kashmir: ఈ కేసు దర్యాప్తు అంత ఈజీ కాదు.. క్లిష్టంగా మారింది!: 'కథువా' కేసు దర్యాప్తు అధికారిణి శ్వేతాంబరి శర్మ

  • సాక్ష్యాల సేకరణ కష్టంగా మారింది
  • ఘటన పాశవికమైనదైనప్పటికీ ఆధారాలే ముఖ్యం
  • ఆధారాల సేకరణ అంత సులభం కాదు

దేశాన్ని కుదిపేసిన కథువా ఘటనపై డీఎస్పీ శ్వేతాంబరి శర్మ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు క్లిష్టంగా మారిందని, ఇది తమకు నిజంగా సవాల్ వంటిదని ఆమె అన్నారు. 8 ఏళ్ల చిన్నారి హత్యాచార కేసు దర్యాప్తుకు శ్వేతాంబరి నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో ఆధారాల సేకరణ చాలా కష్టతరంగా ఉందని అన్నారు. నిందితులను విచారిస్తున్నప్పటికీ, సంబంధిత ఆధారాల సేకరణ సాధ్యం కావడం లేదని ఆమె అన్నారు.

ఈ ఘటన చాలా పాశవికమైనదన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ, కేసు విచారణకు కావాల్సింది ఆధారాలని, వాటి సేకరణ అంత సులభం కాదని ఆమె పేర్కొన్నారు. అలాగే బాధితురాలి లాయర్ దీపికా సింగ్ రజావత్ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

సిట్ పర్యవేక్షకురాలు శ్వేతాంబరి శర్మ మేధాశక్తిపై అనుమానాలున్నాయన్న డిఫెన్స్‌ లాయర్‌ ఆరోపణలకు ఆమె సమాధానమిస్తూ, ఒక మహిళను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం సరికాదని అన్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. దానికి దేశ ప్రజలే బదులిస్తారని ఆమె అన్నారు. న్యాయ వ్యవస్థ చాలా శక్తిమంతమైందని పేర్కొన్న ఆమె, న్యాయంపై అనుమానాలు అక్కర్లేదని చెప్పారు.

More Telugu News