సన్ రైజర్స్ నెంబర్ వన్...నెంబర్ టూ ముంబై ఇండియన్స్!: జేమ్స్ ఫాల్కనర్

19-04-2018 Thu 09:28
  • ఈ సీజన్ లో అత్యుత్తమ బౌలింగ్ వనరులు కలిగిన జట్లు ఇవే
  • సన్ రైజర్స్ లో భువీ, రషీద్, సిద్ధార్థ్, దీపక్, నబీ 
  • ముంబై టీంలో డెత్ ఓవర్ స్పెషలిస్టులు బుమ్రా, ముస్తాఫిజుర్  

ఐపీఎల్ సీజన్-11లో అద్భుతమైన బౌలింగ్ వనరులు కలిగిన జట్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ నిలుస్తాయని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ వ్యాఖ్యానించాడు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, సన్ రైజర్స్ జట్టులో భువనేశ్వర్‌, రషీద్‌ ఖాన్‌ లాంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారని చెప్పాడు. బౌలింగ్‌ పరంగా చూస్తే సన్‌ రైజర్స్‌ ఈ సీజన్ లో బలమైన జట్టని అన్నాడు. భువనేశ్వర్‌ కుమార్ గత కొన్ని సీజన్ల నుంచి అద్భుతమైన ఫామ్‌ లో ఉన్నాడని గుర్తు చేశాడు.

 మరోవైపు ప్రపంచ టీ20 క్రికెట్లో ఉత్తమ మణికట్టు స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్ కూడా ఇదే జట్టులో ఉన్నాడని, యువ పేసర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, పార్ట్‌ టైమ్‌ బౌలర్లుగా దీపక్‌ హుడా, మహమ్మద్‌ నబీలాంటి ఆటగాళ్లు ఆ జట్టుకి అందుబాటులో ఉన్నారని ఫాల్కనర్ చెప్పాడు. దీంతో ఈ సీజన్ లో బౌలింగ్ లో సన్ రైజర్సే నెంబర్ వన్ జట్టని చెప్పాడు.

ఇక దాని తరువాతి స్థానంలో ముంబై ఇండియన్స్ నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఆ జట్టులో ఇద్దరు డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ లు ఉన్నారని గుర్తుచేశాడు. జస్ ప్రీత్ బుమ్రా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్ లు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలరని అన్నాడు. దీంతో వారి జట్టు మంచి బౌలింగ్ వనరులు కలిగిన జట్టుగా రెండో స్థానంలో నిలుస్తుందని ఫాల్కనర్ తెలిపాడు.