Barbara Bush: అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్ సతీమణి బార్బారా బుష్ కన్నుమూత

  • సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బార్బారా
  • అమెరికాలో అక్షరాస్యత పెంపునకు విశేష కృషి
  • ప్రియమైన అమ్మను కోల్పోయామన్న జూనియర్ బుష్

అమెరికాలో అక్షరాస్యత కోసం విశేష కృషి చేసిన ఆ దేశ మాజీ ప్రథమ మహిళ, సీనియర్ బుష్ సతీమణి బార్బారా బుష్ (92) కన్నుమూశారు. టెక్సాస్‌లోని హోస్టన్‌లో తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బార్బారా బుష్ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

బార్బారా బుష్ భర్త సీనియర్ బుష్ 1989-1993 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో బార్బారా అక్షరాస్యత పెంపు కోసం దేశమంతా పర్యటించారు. ప్రతి కుటుంబానికి అక్షరాస్యత అనే నినాదంతో విస్తృత ప్రచారం నిర్వహించారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు రాసిన ఆమె 2003లో తన ఆత్మకథను విడుదల చేశారు.

ఇక బార్బారా కుమారుడు జూనియర్ బుష్ కూడా అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి మరణవార్తను ధ్రువీకరిస్తూ మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రియమైన అమ్మను కోల్పోయాం’ అని అందులో పేర్కొన్నారు.

More Telugu News