ipl: రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం

  • రాయల్స్ జట్టు వరుస విజయాలకు అడ్డుకట్ట
  • బ్యాట్స్ మెన్ విఫలం.. సత్తా చాటిన నైట్ రైడర్స్   
  • ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నితీశ్ రాణా

జైపూర్‌ లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టును కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఓడించింది. ఈ మ్యాచ్ లో ఓటమి ద్వారా సొంత మైదానంలో కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు కోల్ కతా జట్టు అడ్డుకట్ట వేసింది. ఈ మైదానంలో వరుసగా 9 మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ తొలి మూడు ఓవర్లలో ఆచితూచి ఆడింది. నాలుగో ఓవర్ లో రహానే జూలు విదిల్చి వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. ఆ తరువాతి ఓవర్లో 13 పరుగులు పిండుకున్నారు. స్కోరు బోర్డు ఉరకలెత్తుతుండగా, కోల్ కతా కెప్టెన్ దినేష్ కార్తీక్, రహానే (36) ను అద్భుతమైన త్రోతో రనౌట్ చేసి పెవిలియన్ కు పంపాడు.  ఆ తరువాత షార్ట్ (44) మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. సంజూ శామ్సన్‌ (7), రాహుల్ త్రిపాఠి (15), బెన్ స్టోక్స్‌ (14) దారుణంగా విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.

అనంతరం, బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆరంభంలోనే లిన్ (0) వికెట్ కోల్పోయినప్పటికీ రాబిన్‌ ఉతప్ప (48), సునీల్ నరైన్‌ (35‌) ధాటిగా ఆడడంతో లక్ష్యానికి చేరువైంది. దినేష్ కార్తీక్ (42), నితీశ్ రాణా (35) రాణించడంతో కోల్‌కతా 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన నితీశ్ రాణా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా నిలిచాడు.

More Telugu News