iraq: ఐసిస్ తో సంబంధాలున్న సుమారు 300 మందికి మరణశిక్ష విధించిన ఇరాక్ కోర్టులు!

  • ఉగ్ర సంబంధాలపై ఇరాక్ కఠిన శిక్షలు
  • శిక్షలకు గురైన వారిలో విదేశీయులు, మహిళలు
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న హ్యూమన్ రైట్స్ వాచ్

గత డిసెంబర్ లో ఇస్లామిక్‌ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ అధీనంలో ఉన్న నగరాలను హస్తగతం చేసుకున్న తరువాత, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇరాక్ న్యాయస్థానాలు పలువురికి కఠిన శిక్షలు విధిస్తున్నాయి. ఐఎస్ఐఎస్ లో చేరి, ఉగ్రవాదులుగా మారిన వారితో పాటు, వారి కార్యకలాపాలకు సహకరించిన వారందర్నీ ఇరాక్ లోని సంకీర్ణ సేనలు అదుపులోకి తీసుకోగా, వారిలో సుమారు 300 మందికి న్యాయస్థానాలు మరణశిక్షను ఖరారు చేశాయి. శిక్షలు పడిన వారిలో డజన్ల కొద్దీ విదేశీయులు కూడా వుండడం విశేషం. ఈ వివరాలను బుధవారం ఇరాక్ న్యాయ వర్గాలు వెల్లడించాయి.

ఇందులో భాగంగా జనవరి నుంచి 103 మంది విదేశీయులకు మరణశిక్ష పడింది. వీరిలో బుధవారం నాడు మరణశిక్షకు గురైన ఆరుగురు టర్కీ దేశస్థులు కూడా వున్నారు. ఇక 185 మందికి జీవిత ఖైదు విధించారు. శిక్షకు గురైన మహిళలు ఎక్కువమంది టర్కీ, పూర్వపు సోవియట్ యూనియన్‌ కు చెందిన వారని న్యాయ వర్గాలు వెల్లడించాయి.  

ఐసిస్ తో సంబంధాలున్న ఓ జర్మన్ మహిళకు జనవరిలో ఇరాకీ కోర్టు మరణశిక్షను విధించగా, ఈ మంగళవారం నాడు ఓ ఫ్రెంచ్‌ మహిళకు జీవిత ఖైదు విధించారు. మోసుల్ సమీపంలోని టెల్ కీఫ్ న్యాయస్థానం 212 మందికి ఉరిశిక్ష, 150 మందికి జీవిత ఖైదు, 341 మందికి వివిధ రకాల జైలు శిక్ష విధించింది.

ఈ శిక్షల విధింపు విషయంలో ఇరాక్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని హ్యూమన్‌ రైట్స్ వాచ్ అభ్యంతరం చెబుతోంది. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల అమాయకులు శిక్షల బారిన పడతారని, బాధితులకు సరైన న్యాయం అందదని ఆందోళన వ్యక్తం చేసింది.

More Telugu News