Saina Nehwal: నాకు గెలవాలన్న లక్ష్యమే తప్ప.. ప్రణాళిక అంటూ ప్రత్యేకంగా ఉండదు!: సైనా నెహ్వాల్

  • 11 రోజులు నిరంతరాయంగా ఆడాము
  • టీమ్ ఈవెంట్ లో గెలిచిన స్వర్ణం సంతోషాన్నిచ్చింది
  • సింధుపై గెలవాలన్న లక్ష్యంతోనే బరిలో దిగాను

కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా 11 రోజుల పాటు నిరంతరాయంగా ఆడామని రెండు స్వర్ణాలతో ఆకట్టుకున్న సైనా నెహ్వాల్ తెలిపింది. సింధుతో ఆడి గెలిచిన స్వర్ణం కంటే, టీమ్ ఈవెంట్ లో గెలిచిన స్వర్ణం తనకు ఎక్కువ ఆనందాన్నిచ్చిందని చెప్పింది. అయితే సింధుతో మ్యాచ్ లో గెలవడం ద్వారా తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పినట్టైందని సైనా పేర్కొంది. మ్యాచ్ కు ముందు ప్రణాళికలు వేసుకోనని సైనా వెల్లడించింది. మ్యాచ్ లో గెలవాలన్న లక్ష్యంతో కోర్టులో అడుగు పెడతానని చెప్పింది.

ప్రత్యర్థి ఆటతీరును బట్టి తన ఆటతీరును మలచుకుంటానని చెప్పింది. బహుశా ప్రణాళిక లేకుండా కోర్టులో దిగే క్రీడాకారిణిని తాను ఒక్కదాన్నేమోనని పేర్కొంది. ఇతర మ్యాచ్ ల లాగే సింధుతో మ్యాచ్ కు కూడా సన్నద్ధమయ్యానని తెలిపింది. సింధుపై గెలవాలన్న లక్ష్యంతోనే ఆడానని చెప్పింది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే తన లక్ష్యమని సైనా స్పష్టం చేసింది. సింధు కూడా అలాగే ఆలోచిస్తుందనుకుంటానని నవ్వేసింది. ఈ మ్యాచ్ కు ముందు గోపీ సార్ 'మీరు దేశం కోసం ఆడుతున్నారన్న విషయం గుర్తుంచుకోండి. మీ ఆటను చూసి దేశం గర్వించాల'ని చెప్పారని, ఆ మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సైనా తెలిపింది.

More Telugu News