Mumbai Indians: రో'హిట్' ముందు విరాట్ విశ్వరూపం వృథా!

  • నాలుగో మ్యాచ్ లో తొలి విజయం సాధించిన ముంబై ఇండియన్స్
  • 52 బంతుల్లో 94 పరుగులు చేసిన రోహిత్ శర్మ
  • కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరు
  • 62 బంతుల్లో 92 పరుగులు చేసినా దక్కని విజయం

అసలే వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయి, పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉన్న జట్టు... ఉమేష్ యాదవ్ తొలి ఓవర్ వేస్తుంటే, తొలి, రెండో బంతికి, మంచి ఫామ్ లో ఉన్న సూర్యకుమార్, ఇషాన్ కిషన్ లు డక్కౌటైన వేళ... రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. రెండు బంతుల్లో రెండు వికెట్లు పోయాయన్న ప్రభావం నుంచి జట్టును బయటపడేసి, భారీ స్కోరును సాధించడంతో పాటు జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. వాంఖడే స్టేడియంలో గత రాత్రి జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పోటీ పడిన ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కెప్టెన్ల మధ్య బ్యాటింగ్ సమరంగా సాగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ 52 బంతుల్లో 94, లోయిస్ 42 బంతుల్లో 65 పరుగులు చేశారు. ఆపై 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. 62 బంతుల్లో 7 ఫోర్లు, నాలుగు సిక్సులతో 92 పరుగులు చేసినా ఆ జట్టు ఇన్నింగ్స్ 167 పరుగుల వద్ద ఆగిపోయింది. ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కోహ్లీకి అండగా నిలిచే ఆటగాళ్లు లేకుండా పోయారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా నేడు రాజస్థాన్, కోల్ కతా జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది.

More Telugu News