Andhra Pradesh: అరవై ఎనిమిదేళ్ల వయసులో చంద్రబాబు చేసే సాహస దీక్ష ఇది : మంత్రి కళా వెంకట్రావు

  • 20న సీఎం చంద్రబాబు ‘ధర్మపోరాట దీక్ష’
  • దీక్షా స్థలి ఏర్పాట్లపై మంత్రుల ఉప సంఘం భేటీ
  • సీఎం పోరాటానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతివ్వాలి

కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 20 వ తేదీన ధర్మపోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. ధర్మపోరాట దీక్ష కార్యక్రమం విజయవంతానికి సచివాలయంలోని తన కార్యాలయంలో పలు శాఖలకు చెందిన అధికారులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన నారా లోకేష్, దేనినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రతో కూడిన నలుగురు మంత్రుల ఉప సంఘం భేటీ అయింది.

 ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ‘ధర్మపోరాట దీక్ష’ నిర్వహణకు ఆయా శాఖల అధికారులకు మంత్రుల ఉప సంఘం దిశానిర్దేశం చేసింది. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు 68 ఏళ్లలో వయస్సులో చేపడుతున్న ఈ సాహస కార్యక్రమానికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు మద్దతివ్వాలని కోరారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ నిరశన దీక్షలో పాల్గొంటారని చెప్పారు.విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చంద్రబాబునాయుడు చేపట్టనున్న ఒక రోజు నిరాహాదీక్ష ఏర్పాట్ల బాధ్యతలను కృష్ణా జిల్లా కలెక్టర్ కు లక్ష్మీకాంతంకు అప్పగించినట్టు చెప్పారు. పలు పార్టీల నేతలు, అఖిలపక్ష నేతలు హాజరుకానున్నారని, రెవెన్యూ, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండు వేదికలు ఏర్పాటు చేయాలని, ఒకదానిపై సీఎం చంద్రబాబు దీక్ష చేపడతారని, మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రధాన వేదికపై 150 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం పరుపులు వేయాలని కలెక్టర్ లక్ష్మీకాంతంను ఆదేశించారు. వేదిక ఎదురుగా 10 వేల మంది ఆసీనులయ్యేలా కుర్చీలు వేయాలని, దీక్ష ఉద్దేశాన్ని తెలియజేసే విధంగా వేదికను రూపొందించాలని ఆదేశించారు.

 అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానిస్తున్నాం : మంత్రి లోకేష్

ధర్మపోరాట దీక్షకు అన్ని పార్టీల నేతలనూ, అఖిలపక్ష నేతలనూ ఆహ్వానిస్తున్నట్టు ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, చెప్పారు. వారితో పాటు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, వాణిజ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, బార్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్లు, రిక్షా, ఆటో యూనియన్లు, విద్యార్థి సంఘాలతో పాటు డాక్టర్లు...ఇలా అన్ని వర్గాల ప్రతినిధులకూ దీక్షలో పాల్గొనాలంటూ లేఖలు రాయనున్నట్టు చెప్పారు. పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్ ను ఆదేశించారు. ధర్మపోరాట దీక్షకు సంబంధించి విశేష ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్లును నారా లోకేష్ ఆదేశించారు.

 మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలి

ధర్మపోరాట దీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని లోకేష్ ఆదేశించారు. రెండు వేదికలు, సభికులు కూర్చునే ప్రాంగణంతో పాటు స్టేడియం బయట కూడా టెంట్లు ఏర్పాటు చేయాలని, వేదికలతో పాటు మైక్, ఇతర సౌండ్ సిస్టమ్ ల ఏర్పాట్లు 19 వ తేదీ నాటికే పూర్తి చేయాలని ఆదేశించారు. సభా స్థలితో పాటు స్టేడియం బయటా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని, దీక్షా సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు అన్ని సంఘాల ప్రతినిధులు మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఏపీకి జరుగుతున్న అన్యాయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అరవై ఎనిమిదేళ్ల వయసులో చంద్రబాబు సాహస దీక్ష చేస్తున్నారని, ఢిల్లీలో కదలిక రావాలనే ఉద్దేశంతోనే ఈ పవిత్ర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారని అన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి, ధర్మపోరాట దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర యుజన సర్వీసులు, క్రీడలు, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు.

More Telugu News