Telangana: జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణను నెలాఖరులోగా పూర్తి చేయాలి: తెలంగాణ సీఎస్

  • పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్
  • జాతీయ రహదారుల భూ సేకరణకు ప్రాధాన్యమివ్వాలి
  • 20 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలకు పంపించాం

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారులకు భూసేకరణ, హరితహారం, సివిల్ సర్వీసెస్ డే, భూరికార్డుల నవీకరణ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యక్రమాలు, గ్రామ స్వరాజ్ అభియాన్, డాష్ బోర్డ్, 2021 సెన్సస్ డేటా సేకరణకు ముందస్తు చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, జాతీయ రహదారుల భూ సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని, ఈ నెలాఖరులోగా భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ల్యాండ్ రికార్డ్సు అప్ డేషన్ కు సంబంధించి రైతుల ఆధార్ సీడింగ్ ను, తహసీల్దార్లు తమ డిజిటల్ సిగ్నేచర్ లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ముద్రించిన 20 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలకు పంపించామని, ఒరిజినల్ రికార్డులతో సరిచూసుకోవాలని, ఏమైనా తేడాలుంటే పంపాలని అన్నారు.

ఏప్రిల్ 21 న సివిల్ సర్వీసెస్ డే నిర్వహణ:

షెడ్యూల్డు కులాల రెసిడెన్షియల్ పాఠశాలలకు 72 చోట్ల భూములను గుర్తించాల్సి ఉందని, మరో 10 చోట్ల గుర్తించిన భూములను అప్పగించాల్సి ఉందని, 114 చోట్ల ఇప్పటికే భూములు అప్పగించడం జరిగిందని కలెక్టర్లకు ఎస్.కె.జోషి తెలిపారు. ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే నిర్వహణకు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జి.ఏడి-డాష్ బోర్డ్స్ కు అవసరమైన బేసిక్ డాటాను వెంటనే అప్ లోడ్ చేయాలని కోరారు. వాట్సాప్ ద్వారా నిర్ణీత సమయంలో సింగిల్ కమ్యూనికేషన్ (డ్రాప్ బాక్స్) అందుతున్న విషయంపై కలెక్టర్లతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 7 ముఖ్యపథకాలపై కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అధికారులు సమీక్షిస్తున్నారని వీటిపై దృష్టి సారించాలని సూచించారు.

2021 సెన్సెస్ డేటా సేకరణకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈ విషయమై జిఏడి ద్వారా ఇప్పటికే డీఓ లేఖ రాయడం జరిగిందని అన్నారు. ఈ అంశంపై జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ, జిల్లాలు, డివిజన్, మండలాల పునర్వ్యవస్ధీకరణను దృష్టిలో ఉంచుకోవాలని, తప్పిపోయిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లాల మధ్య ప్రత్యేకంగా సమన్వయం చేసుకోవాలని జిల్లా సమావేశాలల్లో సిబ్బందిని సెన్సిటైజ్ చేయాలని, డీఆర్ఓ, సీపీఓ, డీపీఓ, డీఈఓ, మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

హరితహారానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ వెంటనే అప్ లోడ్ చేయాలి

2018 హరితహారానికి సంబంధించి జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ ను వెంటనే అప్ లోడ్ చేయాలని, నర్సరీలకు సంబంధించి ప్లానింగ్ మెటీరియల్ ను సమకూర్చుకోవాలని ఎస్.కె.జోషి ఆదేశించారు. హరితహారంలో భాగంగా ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత నివ్వాలని, మొక్కల సర్వైవల్ డేటాను వెంటనే అప్ లోడ్ చేయాలని, వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కల సంరక్షణ, పర్యవేక్షణకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిధులు మంజూరయ్యాయని, వెంటనే నిధులు విడుదల అవుతాయని తెలిపారు.

పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి  

పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ, ధరణి వెబ్ సైట్, భూరికార్డుల ఆధునికీకరణ, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి అన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ గురించి ప్రస్తావిస్తూ.. రెసిడెన్షియల్ పాఠశాలలకు అవసరమైన భూమి కోసం వక్ఫ్ భూములను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ శాఖకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని బడ్జెట్ లో 2 వేల కోట్లు కేటాయించామని, 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి, మైనారిటీ శాఖపై సమీక్ష చేయాలని ఆదేశించారు.

319 మైనారిటీ సంస్ధలకు రూ. 35 కోట్ల నిధులు మంజూరు

రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్లో గుర్తించిన వక్ఫ్ భూములకు సంబంధించి ఎటువంటి ఆక్రమణలు లేని వక్ఫ్ భూములకు వక్ఫ్ సంస్థల పేర పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మైనారిటీ కార్యదర్శి దాన కిషోర్ ఆదేశించారు. కొన్నిచోట్ల ముతావల్లీల పేరిట ఉన్న భూములను వక్ఫ్ సంస్థల పేర పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని అన్నారు.

 మైనారిటీ శాఖ ద్వారా 319 మైనారిటీ సంస్ధలకు 35 కోట్ల మేర అభివృద్ధి పనులు, మరమ్మతుల కోసం నిధుల మంజూరు చేశామని, ఈ పనులను వెంటనే పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి, 46 చోట్ల గుర్తించిన భూములను అప్పగించాలని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాలలు, హాస్టళ్ళకు భూములను గుర్తించాలని కోరారు. అనంతరం, సీఎం కేసీఆర్ ఓఎడీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణలో భాగంగా వారంలో ఒకరోజు మొక్కలకు నీరు పోయడానికి జిల్లాలలో అందరిని భాగస్వామ్యులను చేయాలని ఆదేశించారు.  

More Telugu News