anand mahindra: అతను మీకు తెలిస్తే చెప్పండి.. నాకు పెట్టుబడి పెట్టాలని ఉంది!: ఆనంద్ మహీంద్రా

  • ఆనంద్ మహీంద్రాను ఆకర్షించిన ఫొటో
  • చెప్పుల రిపేర్ షాప్ ను ఆసుపత్రిగా పేర్కొన్న వ్యక్తి
  • అతని వివరాలు కోరుతూ ట్వీట్

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాది వినూత్న శైలి. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఆయనది ఎప్పుడూ ముందడుగే. అలాంటి ఆనంద్ మహీంద్రాను వాట్స్ యాప్ లో ఒక చెప్పులు కుట్టే వ్యక్తి ఆకర్షించాడు. దానికి కారణం ఆ వ్యక్తి తన వ్యాపారాన్ని పదిమందికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రచార ఫ్లెక్సీ.

దాని వివరాల్లోకి వెళ్తే... ఆనంద్‌ మహీంద్రా వాట్స్ యాప్‌ కు రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వ్యక్తికి చెందిన ఒక ఫొటో వచ్చింది. ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి కనీసం దుకాణం కూడా లేదు. రోడ్డుపక్కనే విద్యుత్ స్తంభానికి ఆనుకుని మూడు జతల చెప్పులు, చెప్పులు కుట్టే సామగ్రి, షూపాలిష్ సామగ్రి ముందు పెట్టుకుని కూర్చున్నాడు.

 వెనుకనున్న గోడకు ఫ్లెక్సీలో.. ‘పాడైపోయిన బూట్ల హాస్పిటల్‌ ఇది. డాక్టర్‌. నర్సీరామ్‌.
ఓపీడీ సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
భోజన విరామం: మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హాస్పిటల్‌ తెరిచే ఉంటుంది’ అని ఉంది.

ఇది ఆయనను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో దానిని ట్వీట్ చేస్తూ, ‘ఈ వ్యక్తి ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌ లో మార్కెటింగ్‌ పాఠాలు చెప్పాల్సింది’ అంటూ పేర్కొని, ఈ ఫొటో వాట్స్ యాప్ లో వచ్చింది. ఆయన ఎవరు? ఎక్కడుంటారు? వివరాలేవీ లేవు. మీకు తెలిస్తే కొంచెం చెప్పండి. అతని దుకాణంలో పెట్టుబడి పెట్టాలని ఉంది' అని పేర్కొన్నారు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

More Telugu News