cash crunch: నగదుకు తీవ్ర కటకటలు... సరిపడా ఉందంటూ జైట్లీ పోలిక లేని ట్వీట్లు

  • బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంది
  • కొన్ని చోట్ల డిమాండ్ పెరగడంతో కొరత
  • దాన్ని పరిష్కరించామన్న ఆర్థిక మంత్రి

దేశవ్యాప్తంగా నగదు లేక ఏటీఎంలు బోసిపోతుంటే, నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తుంటే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి మాత్రం అవేమీ కనిపించడం లేనట్టుంది. అసలు నగదుకు కొరత లేదని ఆయన తేల్చేశారు. నగదు కొరతపై పెద్ద ఎత్తున వార్తలు వస్తుండడంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు. నగదు పరిస్థితులను తాను సమీక్షించినట్టు చెప్పారు.

 ‘‘దేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం జరిగింది’’ అని జైట్లీ ట్వీట్ చేశారు. మరోవైపు నగదు లభ్యతను పరిశీలించేందుకు ఆర్ బీఐ ఈ రోజు ఓ కమిటినీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆర్థిక శాఖకు ఆర్ బీఐ పంపిన సమాచారం మేరకు ఏపీ, తెలంగాణ, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకుల్లో ఉన్న నగదు కంటే ఉపసంహరణలు ఎక్కువ అయ్యాయి.

More Telugu News