ATM: మూడు రోజులు ఆగండి... ఏటీఎంలకు డబ్బులు వచ్చేస్తాయి: కేంద్రం కీలక ప్రకటన

  • నగదు లేక నిండుకున్న ఏటీఎంలు
  • డిపాజిట్లతో పోలిస్తే విత్ డ్రాలే అధికం
  • రూ. 1.25 లక్షల కోట్ల నగదు సిద్ధంగా ఉంది
  • మూడు రోజులు ఓపిక పట్టాలన్న కేంద్ర మంత్రి ఎస్పీ శుక్లా

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు నిండుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజర్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఇబ్బంది అధికంగా ఉండగా, మరో మూడు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించింది. బ్యాంకులకు వచ్చే డిపాజిట్లతో పోలిస్తే, ఏటీఎంల నుంచి విత్ డ్రాలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని బ్యాంకులు చెబుతున్నాయి.

నగదు కొరతపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎస్పీ శుక్లా స్పందిస్తూ, తమ వద్ద రూ. 1.25 లక్షల కోట్ల కరెన్సీ ఉందని, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కరెన్సీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కరెన్సీ ఉన్న కారణంగా ఇబ్బందులు వచ్చాయని, తాను ఏర్పాటు చేసిన రాష్ట్రాల కమిటీలు, ఆర్బీఐ ఈ నగదును సమానంగా అన్ని రాష్ట్రాలకూ చేరుస్తుందని తెలిపారు. ఇది జరిగేందుకు కనీసం మూడు రోజులు పడుతుందని, ప్రజలు ఓపికతో ఉండాలని సూచించారు.

More Telugu News