USA: మానవ గుండెలను కాల్చుకు తినే నరరూప రాక్షసుడు 'జంగిల్ జబ్బా' అమెరికాలో అరెస్ట్!

  • లైబీరియాలో జబ్బా మారణహోమం
  • వందలాది మంది ఊచకోత
  • ఆపై శరణార్థిగా అమెరికాకు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

దారుణంగా హత్యలు చేసి, చంపేసిన వారి గుండెలను పెకిలించి, కాల్చుకు తినే నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా అలియాస్ మొహమ్మద్ జబ్బతెహ్ ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. లైబీరియా అంతర్యుద్ధంలో వందలాది మందిని హత్య చేసి అమెరికాకు పారిపోయి వచ్చిన అతను తాజాగా పట్టుబడగా, విచారణలో అతనిచ్చిన వాంగ్మూలం విన్న న్యాయమూర్తులు సైతం విస్తుపోయారు. ఓ తీవ్రవాద సంస్థకు చెందిన జబ్బతెహ్, అత్యంత కిరాతకుడిగా ముద్ర పడ్డాడు.

1990 దశకంలో అతని నేతృత్వంలోని సైన్యం వందలాది మందిని హత్య చేశారు. చిన్నారులను సైనికులుగా మార్చడమే కాకుండా, బహిరంగంగా ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలు చేయించాడు. ఆపై 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయి, అక్కడే పెళ్లి చేసుకుని, ఫిలడెల్ఫియాలో బిజినెస్ మ్యాన్ గా స్థిరపడ్డాడు. ఆపై పదిహేనేళ్ల తరువాత హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అతన్ని గుర్తించి, బాధితులను వెతికి తెచ్చి, సాక్ష్యాలు ఇప్పించాలని ప్రయత్నించారు. అయితే, యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో అతన్ని న్యాయస్థానం దోషిగా తేల్చింది. గురువారం అతనికి శిక్ష ఖరారు చేస్తుంది.
ఈ కేసులో జబ్బతెహ్ కు 30 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక అతనిపై వ్యతిరేకంగా న్యాయస్థానం ముందు సాక్ష్యమిచ్చిన ఓ మహిళ, జబ్బతెహ్ అకృత్యాలను కళ్లకు కట్టినట్టు వివరించింది. తన సైన్యంతో కలసి ఊచకోత కోసిన వారి గుండెలను పెకలించారని, వాటిలో తన భర్త, మరిది గుండెలు కూడా వున్నాయని చెబుతూ, 1991లో తమ గ్రామంపై జరిగిన దాడిని గుర్తు చేసుకుంది. ఆ గుండెలను తినేందుకు వీలుగా వండి పెట్టాలని తనను ఆదేశించారని, వల్లకాదంటే, తననూ చంపేస్తానని బెదిరించారని పేర్కొంది.

More Telugu News