tajmahal: తాజ్ మహల్ ను ఎవరికీ రాసివ్వలేదు.. వక్ఫ్ బోర్డుకి ఎలా చెందుతుంది?: మొఘల్ వారసుడి ప్రశ్న

  • ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డుపై మండిపడ్డ మొఘల్ వారసుడు
  • సున్నీ వక్ఫ్ బోర్డు భూకబ్జాలకు పాల్పడుతోంది
  • షాజహాన్ తాజ్ మహల్ ను ఎవరి పేరిటా రాయలేదు

‘వక్ఫ్‌ కార్యాలయంలో కుర్చీలు, బల్లలు లేవు కానీ తాజ్‌మహల్ కావాలా?’ అంటూ ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుని మొఘల్ వారసుడు ప్రశ్నించారు. ఇటీవల తాజ్‌ మహల్‌ ను మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తమకు రాసిచ్చారంటూ ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు వాదనపై మండిపడ్డ సుప్రీంకోర్టు.. తాజ్‌ ను రాసిచ్చినట్లు షాజహాన్‌ సంతకమేదని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై మొఘల్‌ సామ్రాజ్య ఆఖరి చక్రవర్తి అయిన బహుదూర్‌ షా జఫర్‌ మునిమనవడు వైహెచ్‌ టూసీ మాట్లాడుతూ, తాజ్‌ మహల్‌ భారత్‌ సొత్తని, దానిపై ఎవరికీ వ్యక్తిగత హక్కు లేదని స్పష్టం చేశారు.

తనకు తెలిసినంత వరకు షాజహాన్‌ తాజ్‌ మహల్‌ ను ఎవరి పేరిటా రాయలేదని అన్నారు. ఆయోధ్యలో రామ మందిరం నిర్మించకూడదని ఎందుకు ఆందోళనలు చేపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అన్ని మతాల వారిని దగ్గర చేసేందుకు చేపట్టే ఏ కార్యక్రమానికైనా తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని ఆయన చెప్పారు. తాజ్ మాది అని పేర్కొంటున్న సున్నీ వక్ఫ్‌ బోర్డు భూకబ్జాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మొఘల్‌ వారసులమైన తాము తాజ్‌ మహల్‌ ను భారత ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నామని ఆయన తెలిపారు. తాజ్‌ పేరుతో రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు

More Telugu News