IPL: కోల్‌కతా చేతిలో చిత్తుగా, చెత్తగా ఓడిన ఢిల్లీ.. ఐపీఎల్‌లో కార్తీక్ సేనకు అతిపెద్ద విజయం

  • 71 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ
  • పది పరుగులు కూడా చేయలేకపోయిన 9 మంది ఆటగాళ్లు
  • నితీశ్ రాణాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

ఐపీఎల్‌లో భాగంగా సోమవారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 71 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద విజయం. 201 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గంభీర్ సేన 129 పరుగులకే కుప్పకూలి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప మెరుపులు మెరిపించారు. 19 బంతులు ఎదుర్కొన్న ఉతప్ప 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేయగా, నితీశ్ రాణా 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. ఆండ్రూ రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 12 బంతులు మాత్రమే ఆడిన రసెల్ 6 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు తీసుకోగా, ట్రెంట్ బౌల్ట్, క్రిస్ మోరిస్ చెరో రెండు, నదీమ్, మహమ్మద్ షమీ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం 201 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కోల్‌కతా బౌలర్ల ముందు నిలవలేకపోయారు. తొలి ఓవర్ ఐదో బంతికే ఓపెనర్ జాసన్ రాయ్ (1) వికెట్‌ను కోల్పోయిన ఢిల్లీ ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ పరాజయం పాలైంది.

రిషబ్ పంత్ 43(26 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ 47 (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా మిగతా వారిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. ఫలితంగా 14.2 ఓవర్లలోనే 129 పరుగుల వద్ద ఢిల్లీ తన ఇన్నింగ్స్‌ను ముగించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. పీయూష్ చావ్లా, ఆండ్రూ రసెల్, శివమ్ మావీ, టామ్ కరన్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఓటమి కాగా, నైట్ రైడర్స్‌కు ఇదే అతి పెద్ద విజయం. నితీశ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా రెండింటిలో గెలిచి 4 పాయింట్లతో జాబితాలో రెండో స్థానంలో ఉంది.

More Telugu News