ADR: అమ్మాయిలపై అకృత్యాల కేసుల్లో కమలనాథులే అత్యధికం!

  • ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఏడీఆర్
  • మొత్తం 51 మంది ఎంపీ, ఎమ్మెల్యేలపై రేప్, కిడ్నాప్ కేసులు
  • 14 మంది బీజేపీ వారే, ఆ తరువాత శివసేన ప్రజా ప్రతినిధులు

ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావోలో జరిగిన యువతిపై ఎమ్మెల్యే అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న వేళ, ప్రజలను కాపాడతామని గద్దెనెక్కుతున్న ప్రజా ప్రతినిధుల్లో ఎంతమంది కామాంధులు ఉన్నారన్న విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేయగా, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల్లో 51 మందిపై అత్యాచారం, కిడ్నాప్, హత్యాచారం వంటి ఆరోపణలు ఉండగా, వారిలో అత్యధికులు బీజేపీకి చెందినవారేనని ఏడీఆర్ వెల్లడించింది. కేసులను ఎదుర్కొంటున్న వారిలో 48 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వారిలో 14 మంది బీజేపీ వారేనని తెలిపింది.

ఇక రెండో స్థానంలో శివసేన ఉందని, ఆ పార్టీకి చెందిన ఏడుగురిపై మహిళలపై అకృత్యాలు చేసినట్టుగా కేసులు నమోదై ఉన్నాయని తెలిపింది. మూడో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (6) ఉందని తెలిపింది. వివిధ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సమర్పించిన 4,852 అఫిడవిట్ లను పరిశీలించి ఈ గణాంకాలు క్రోఢీకరించినట్టు తెలిపింది. మొత్తం 1,581 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు తమపై కేసులు ఉన్నట్టు ప్రస్తావించగా, మహిళలపై దాడులు, రేప్ సెక్షన్లకు సంబంధించి 51 మందిపై కేసులున్నాయని పేర్కొంది. ఇక రాష్ట్రాల పరంగా చూస్తే, 12 మంది కళంకితులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, ఆపై 11 మందితో పశ్చిమ బెంగాల్, ఆరుగురితో ఒడిశా ఉన్నాయని వెల్లడించింది.

More Telugu News