Uttar Pradesh: రౌడీ షీటర్ ను బీజేపీ నేతలతో డీల్ చేసుకుని బతికిపొమ్మన్న పోలీసు ఉన్నతాధికారి!

  • నేను నీ కంటే పెద్ద నేరస్తుడ్ని, చాలా మందిని చంపేశాను
  • ప్రాణాలతో ఉండాలనుకుంటే ఒప్పందం చేస్కో
  • యూపీ పోలీస్ అధికారి వార్నింగ్ 

బీజేపీ నేతలతో డీల్ చేసుకుని ప్రాణాలు కాపాడుకోవాలని ఓ నిందితుడిని పోలీస్ ఉన్నతాధికారి బెదిరించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఝాన్సీ జిల్లాలోని మౌరానీపూర్‌ కు చెందిన స్థానిక నేత లేఖ్‌ రాజ్‌ సింగ్‌ యాదవ్‌ పై 70 కేసులున్నాయి. దీంతో అరెస్టు అయిన ఆయన ప్రస్తుతం బెయిల్‌ పై బయట ఉన్నారు.

 ఈ క్రమంలో ఆయనకు గత శుక్రవారం మౌరానీపూర్‌ ఎస్‌ హెచ్‌ఓ సునీత్‌ కుమార్‌ సింగ్‌ ఫోన్ చేసి, ‘ఎన్‌ కౌంటర్ల సీజన్‌ మొదలైంది. నీ మొబైల్‌ నంబర్‌ పై ఇప్పటికే నిఘాపెట్టాం. నువ్వు త్వరలో జరిగే ఎన్‌ కౌంటర్‌ లో చనిపోవచ్చు. ప్రాణాలతో ఉండాలనుకుంటే జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ దూబే, బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్‌ సింగ్‌ లతో ఒప్పందం చేసుకో, లేదంటే నీకు ఏ క్షణంలో అయినా ఏమైనా జరగొచ్చు... నేను నీకంటే చాలా పెద్ద నేరస్థుడిని, ఇప్పటికే చాలా మందిని చంపేశాను’. అంటూ హెచ్చరించారు. దానిని లేఖ్ రాజ్ సింగ్ యాదవ్‌ పెద్దగా పట్టించుకోలేదు.

 దీంతో ఆ రోజు సాయంత్రం హర్‌ కరణ్‌ పురా గ్రామంలో రాజ్ సింగ్ దాక్కున్న ఇంటిని సునీత్‌ నేతృత్వంలోని పోలీసుల బృందం చుట్టుముట్టి కాల్పులు జరిపింది. ఆ కాల్పుల నుంచి తప్పించుకున్న రాజ్ సింగ్..తనతో ఎస్ హెచ్ఓ సునీత్ ఫోన్ లో మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇది వైరల్ గా మారింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. దీంతో ఆ అధికారిని సస్పెండ్ చేసిన పోలీసు శాఖ, విచారణకు ఆదేశించింది.

More Telugu News