missiles: అమెరికా పిచ్చి కానీ.. క్షిపణలు సిరియాను కదిలించగలవా?: పరిశీలకుల విశ్లేషణ

  • సిరియా వద్ద రసాయన ఆయుధాలున్నాయన్నఅమెరికా
  • వాటిని ధ్వంసం చేసేందుకు డమాస్కస్‌పై క్షిపణుల వర్షం
  • అసద్‌తో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

సిరియాపై అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దళాలు బాంబులు వర్షం కురిపిస్తున్నాయన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. రెబల్స్ పట్టున్న డౌమాలో ప్రభుత్వ సేనలు జరిపిన రసాయన దాడుల్లో అమాయక పౌరులు మరణించారన్న వార్త వారం రోజుల క్రితం ప్రపంచాన్ని కుదిపేసింది. దీనికి ప్రతిగా రంగంలోకి దిగిన అమెరికా.. ఫ్రాన్స్, బ్రిటన్ సేనలతో కలిసి సిరియాపై అత్యాధునిక యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. రసాయన ఆయుధాలు ఉన్నట్టు చెబుతున్న డమాస్కస్‌పై దాడిచేసింది. సిరియా రసాయన దాడి చేయబోనని ప్రకటించే వరకు దాడులు జరుగుతూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

అమెరికా దాడిని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తీవ్రంగా ఖండించారు. దాడులు ఆగిన అనంతరం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానికి అసద్ ఫోన్ చేసి మాట్లాడారు. అమెరికా దాడిని పశ్చిమ దేశాల దురాక్రమణగా అభివర్ణించారు. ఈ దాడితో దేశ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని మరింత గట్టిగా నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ప్రతీ అంగుళాన్నీ గాలించి ఉగ్రవాదులను ఏరివేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు.

మరోపక్క, సిరియాపై అమెరికా సంయుక్త దళాలు కురిపించిన కొద్దిపాటి క్షిపణులు ఆ దేశాన్ని పూచికపుల్లంత కూడా కదపలేవని నిపుణులు చెబుతున్నారు. అసద్ అందరిలాంటి నేత కాదని అంటున్నారు. ముఖ్యంగా అరబ్ డిక్టేటర్లు హోస్నీ ముబారక్, గడాఫీ, సద్దాం హుస్సేన్ లాంటి వాడు ఎంతమాత్రమూ కాదని చెబుతున్నారు. సిరియన్ల నుంచి అతడికి పూర్తి మద్దతు ఉందని, అతడిని ఎదుర్కోవడం ఏమంత తేలిక కాదని స్పష్టం చేస్తున్నారు.

సైనిక దళాల నుంచి కూడా అతడికి పూర్తి మద్దతు ఉంది. రెబల్స్‌కు పట్టున్న గౌటాపై ఇటీవల విజయం సాధించడం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దీనికి తోడు రష్యా మద్దతు ఎలానూ ఉంది. కాబట్టి.. సద్దాంను వణికించినట్టో.. ఇంకెవరిపైనో ప్రతాపం చూపినట్టో అసద్‌ను ఆడించాలనుకోవడం అమెరికా మూర్ఖత్వమే అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

More Telugu News