Chandrababu: ఏపీకి అతి పెద్ద సంక్షోభం ఇదే: సింగపూర్ లో చంద్రబాబు

  • రాజధాని లేకపోవడం పెద్ద సంక్షోభం
  • సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తానని ప్రజలకు మాట ఇచ్చా
  • సైబరాబాద్ వంటి నగరాన్ని నిర్మించిన అనుభవం నాకుంది

రాజధాని కూడా లేకపోవడం ఆంధ్రప్రదేశ్ కు అతి పెద్ద సంక్షోభమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింగపూర్ లో ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై ఆయన మాట్లాడుతూ, సైబరాబాద్ వంటి నగరాన్ని నిర్మించిన అనుభవం తనకు ఉందని చెప్పారు. కొత్త రాజధానికి భూమిని సమకూర్చుకోవడం పెద్ద సవాల్ అని, దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.

33 వేల ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని, 6 నెలల్లోనే సింగపూర్ ప్రభుత్వం ఏపీ రాజధానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని చెప్పారు. అమరావతిలో మౌలిక వసతుల నిర్మాణాన్ని చేపట్టామని... రాజధాని ప్రణాళికలు, ఆకృతుల రూపకల్పనకు ప్రపంచంలోని అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించుకున్నామని తెలిపారు. సింగపూర్ తరహా నగరాన్ని నిర్మిస్తానని ప్రజలకు మాట ఇచ్చానని చెప్పారు. అంతకు ముందు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆయనతో కలసి అల్పాహారాన్ని స్వీకరించారు.  

More Telugu News