Hyderabad: హైదరాబాద్ పోలీసులకే సవాల్ గా మారిన సైబర్ క్రైమ్ మిస్టరీ ఇది!

  • అద్దె ఇంటి కోసం వచ్చి డెబిట్ కార్డు చోరీ
  • పిన్ నంబర్ లేకుండానే ఏటీఎం నుంచి డబ్బు డ్రా
  • తాత్కాలిక పిన్ సృష్టించానంటున్న నిందితుడు
  • అది అసాధ్యమని బ్యాంకు అధికారుల వివరణ

ఓ నేరం జరిగింది. అది ఓ సైబర్ క్రైమ్. అయితే ఇది ఎలా జరిగింది? హైదరాబాద్ పోలీసుల ముందు సవాల్ విసురుతున్న నేరమిది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నార్త్ ఇండియాకు చెందిన ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు హర్ష్‌ కరీవాల, వన్ష్‌ దత్తా, ఆకాశ్‌ గార్గ్‌ కొండాపూర్ లోని రాఘవేంద్ర కాలనీలో ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లును తీసుకుని ఉంటున్నారు. వారిలో ఓ వ్యక్తి ఇటీవల మరణించడంతో ఓ బెడ్ రూమ్ ఖాళీ అయింది. ఈ రూమ్ ను అద్దెకిస్తామని వన్ష్ దత్తా అనే ఉద్యోగి ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు పెట్టడంతో రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. తనపేరు శ్రీనివాసరెడ్డి అని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, తిరుపతికి చెందిన వాడినని, న్యూఢిల్లీ, పుణెల్లో పనిచేశానని, ఇటీవల గూగుల్ లో ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నాడు. ఫ్లాట్ నచ్చిందని చెప్పాడు. అద్దె వివరాలు కనుక్కున్నాడు.

 వీరి ఫ్లాట్ కు వస్తున్న సమయంలోనే తన ఫోన్ స్విచ్చాఫ్ అయిందంటూ ఆ గదిలో చార్జింగ్ పెట్టుకున్న అతను, వాష్ రూముకు వెళ్లి వస్తానంటూ, హర్ష్ రూమ్ లోకి వెళ్లి, అతని డెబిట్ కార్డును కొట్టేశాడు. బయటకు వచ్చి, ఇల్లు దొరికిన విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాలంటూ, అతని ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. కాల్ కలవడం లేదని చెబుతూ, మెసేజ్ చేస్తానని చెప్పి ఏదో టైప్ చేశాడు. ఆపై ఫోన్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఆపై రాత్రి 10 గంటల సమయంలో డెబిట్ కార్డు నుంచి మూడు విడతలుగా రూ. 49,900 డ్రా అయినట్టు హర్ష్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది.

ఇక హర్ష్ ఫిర్యాదు మేరకు నిందితుడిని గుర్తించిన పోలీసులు విచారించగా, డెబిట్ కార్డుకు తాత్కాలిక పిన్ నంబర్ ను సృష్టించానని, దాని సాయంతో డబ్బు డ్రా చేశానని చెబుతుండగా, తాత్కాలిక పిన్ నంబర్ సృష్టించడం అసాధ్యమని బ్యాంకు అధికారులు చెబుతుండటంతో ఏం చేయాలో పోలీసులకు పాలుపోవడం లేదు. ఫోన్ లో ఏదైనా బగ్ ను ఇన్ స్టాల్ చేసి, దాని సాయంతో ఓటీపీ తన ఫోన్ నంబరుకు వచ్చేలా చేసుకుని ఉండవచ్చని బ్యాంకు సిబ్బంది భావిస్తుండగా, పోలీసులు దాన్ని అంగీకరించడం లేదు. ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగిస్తున్నట్టు గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు.

More Telugu News