Imran Khan: శివుడి గెటప్ లో ఇమ్రాన్ ఖాన్.. అట్టుడికిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ

  • శివుడి ముఖం స్థానంలో ఇమ్రాన్ ముఖం
  • సోషల్ మీడయాలో వైరల్ అవుతున్న ఫొటో
  • దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం

పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ శివుడి గెటప్ లో కనిపించడంపై పాకిస్థాన్ లో కలకలం రేగుతోంది. పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని హిందూ ప్రజాప్రతినిధులు లేవనెత్తారు. పాక్ లోని హిందువును కాపాడేది ఇమ్రాన్ ఖానే అంటూ... శివుడి గెటప్ లో ఉన్న ఇమ్రాన్ ఫొటో ప్రస్తుతం ఆ దేశ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అంశంపై జాతీయ అసెంబ్లీ అట్టుడుకింది. ఈ సందర్భంగా దేశీయాంగ మంత్రి సభలో మాట్లాడుతూ, ఈ ఫొటోను ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.

డాన్ న్యూస్ కథనం ప్రకారం... సభలో హిందూ ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేసిన అనంతరం దీనిపై విచారణ జరిపించాలనే నిర్ణయానికి దేశీయాంగ మంత్రితో కలసి స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ వచ్చారు. సభలో ఈ అంశాన్ని హిందూ లెజిస్లేటర్ రమేష్ లాల్ ప్రవేశపెట్టారు. శివుడి ముఖం స్థానంలో ఇమ్రాన్ ముఖాన్ని ఉంచి చేస్తున్న ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ ప్రజాప్రతినిధులు కోరారు. ఈ నేపథ్యంలో ఏడు రోజుల్లోగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని దేశీయాంగ మంత్రి ఆదేశించారు.

ఈ ఘటనపై తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ స్పందించింది. పాక్ లోని హిందువులకు పూర్తి స్థాయిలో అండగా ఉన్నది తెహ్రీక్ ఈ ఇన్సాఫేనని ఆ పార్టీ వైస్ ఛైర్మన్ షా మమమ్మద్ ఖురేషీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి చెందిన సోషల్ మీడియా వింగ్ ఈ ప్రచారం చేపట్టి ఉండవచ్చని అన్నారు. మరోవైపు 2014లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే పాక్ ను వదిలి వెళ్లిన హిందువులంతా తిరిగి స్వదేశానికి వచ్చేస్తారని చెప్పారు. హిందువులు, కలాష్ ప్రజలను బలవంతంగా మత మార్పిడిలు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

More Telugu News