Bengalore: అదృశ్యమైన ఆత్రేయీ మజుందార్ ఆచూకీ దొరికింది...!

  • వారం నాడు ఇంటి నుంచి అదృశ్యమైన ఆత్రేయి
  • స్క్రిజోఫ్రీనియాతో బాధపడుతున్న అమ్మాయి
  • నిర్మాణంలో ఉన్న భవంతిలో గుర్తించిన సెక్యూరిటీ గార్డు

దాదాపు వారం రోజుల క్రితం బెంగళూరులో అదృశ్యమైన ఆంథ్రోపాలజిస్ట్ ఆత్రేయీ మజుందార్ ఆచూకీ లభ్యమైంది. ఏప్రిల్ 6న ఇంటి నుంచి వెళ్లి మాయమైన ఆమె, ఢిల్లీలో ఉన్నట్టు తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెను వెతికి పట్టుకునేందుకు బంధుమిత్రులు, పోలీసులు గూగుల్ సాయం కూడా తీసుకున్నారు. టొరంటోలో రీసెర్చ్ చేస్తున్న ఆమె, చివరిసారిగా మారియట్ హోటల్ సెక్యూరిటీ కెమెరాల్లో కనిపించి, ఆపై అదృశ్యమయ్యారు.

ఆమెకు చెందిన పలు చిత్రాలను విడుదల చేస్తూ, గూగుల్ స్ప్రెడ్ షీట్స్ ప్రారంభించి వెతుకుతుండగా, బెంగళూరులోని ఎంజీ రోడ్డులో ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్ పక్కన నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవంతి సెక్యూరిటీ గార్డు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. నిర్మాణంలో ఉన్న భవంతిలో ఆమె నిద్రిస్తుండగా, పోలీసులు గుర్తించారు. అంతకుముందు సెక్యూరిటీ గార్డు ఆమెను ప్రశ్నించగా, తానెవరన్న విషయాన్ని వెల్లడించకుండా, పోలీసులతోనే మాట్లాడతానని చెప్పినట్టు తెలుస్తోంది.

ఆమె స్క్రిజోఫ్రీనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని, అందుకు చికిత్స కూడా పొందుతోందని, మానసిక వైకల్యంతోనే ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసిందని మరాతహళ్లి పోలీసు అధికారులు వెల్లడించారు. ఇంటి నుంచి వచ్చిన తరువాత రెండు రోజులు మారియట్ హోటల్ లో ఉన్న ఆమె 6వ తేదీన హోటల్ నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఆపై శివాజీ నగర్ లో తనకు చికిత్సను అందిస్తున్న ఆసుపత్రికి వెళ్లి, 10వ తేదీ వరకూ అక్కడే ఉందని తెలిపారు.

ఆపై సోషల్ మీడియాలో తన ఫోటోలు వస్తున్నాయని తెలుసుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి ఎంజీ రోడ్డులోని హోటల్ కు వెళ్లి రూమ్ అడిగిందని, అయితే, అడ్వాన్స్ చెల్లించేందుకు ఆమె వద్ద డబ్బులేకపోవడంతో హోటల్ మేనేజ్ మెంట్ ఆమెను బయటకు పంపిందని తెలిపారు. దీంతో ఆమె, పక్కనే నిర్మాణంలో ఉన్న భవంతిలోకి వెళ్లిందని, అక్కడే ఓ రోజంతా గడిపిందని తెలిపారు. ఆమెను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్టు వెల్లడించారు.

More Telugu News