algeria: అల్జీరియా విమాన ప్రమాదంలో మృతులు 257 మంది!

  • బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ వెళ్తున్న విమానం
  • టేకాఫ్ అయిన కాసేపటికే కూలిన వైనం 
  • ప్రాణాలతో బయటపడిన ఇద్దరు  

అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 257 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఆ దేశ రాజధాని అల్జీర్స్‌ కి సమీపంలోని బౌఫరిక్‌ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి 259 మందితో బయల్దేరిన ఇల్యుషిన్‌ 2–76 రవాణా విమానం, టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానాశ్రయం సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా విమానంలోంచి మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటల్లో 257 మంది సజీవదహనమయ్యారని, ఇద్దరు మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నారని రక్షణ శాఖాధికారులు తెలిపారు.

మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైరింజన్లు, 14 అంబులెన్స్ లను వినియోగించినట్టు తెలిపారు. విమానంలోని మృతులంతా ఆర్మీకి చెందిన వారు, వారి కుటుంబ సభ్యులేనని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని, ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదని వారు తెలిపారు. కాగా, 2014లో ఉక్రెయిన్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన భారీ విమాన ప్రమాదం ఇదేనని తెలుస్తోంది. 

More Telugu News