Deccan Chronicle: 'డెక్కన్ క్రానికల్' స్వాధీనానికి టైమ్స్, జీ, టీవీ9 ప్రయత్నాలు... విజయమెవరిదో!

  • కెనరా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌
  • చెల్లించడంలో విఫలం కావడంతో దివాలా ప్రక్రియ ప్రారంభం
  • టేకోవర్ కు 9 సంస్థలు ఆసక్తి

కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేని స్థితిలో ఉన్న 'డెక్కన్ క్రానికల్' యాజమాన్య సంస్థ డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌)ను స్వాధీనం చేసుకోవడానికి 9 కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయి. వీటిలో ఐదు పెద్ద మీడియా సంస్థలు కూడా ఉండటం గమనార్హం. హైదరాబాద్ కెనరా బ్యాంకు దాఖలు చేసిన కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ అనుమతిస్తూ తొలుత దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణుడిగా కేకే రావును, ఆపై కోల్‌కతాకు చెందిన మమతా బినానిని  నియమించడం జరిగింది.

ఈ మొత్తం ప్రక్రియకు సలహాదారుగా ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ సంస్థను నియమించారు. ఆస్తుల విలువ మదింపు తరువాత, మమతా బినాని ఇటీవల మధ్యంతర నివేదికను సమర్పించారు. కంపెనీని టేకోవర్ చేసే ఆసక్తి ఉన్న సంస్థల నిమిత్తం గడచిన ఫిబ్రవరి 8న ప్రకటన జారీ చేసి, 15 వరకు గడువు పెట్టగా, పలు ప్రముఖ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.

సంస్థ ఆస్తుల్లో భూమి, భవనాలు, ప్రింటింగ్ ప్రెస్ లు, మెషినరీ, ఏర్‌ క్రాఫ్ట్‌, కంప్యూటర్లు, ఫర్నిచర్‌, వాహనాలు ఉన్నాయి. అలాగే దినపత్రిక బ్రాండ్‌ విలువను కూడా అంచనా వేయాల్సివుంది. ఇది కూడా సంస్థ ఆస్తిలోకే వస్తుంది. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు టైమ్స్‌ గ్రూప్ కు చెందిన బెన్నెట్‌ కోల్మెన్‌ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌, ఎస్సెల్‌ గ్రూప్ (జీ)కి చెందిన ఆర్మ్‌ ఇన్‌ఫ్రా అండ్‌ యుటిలిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు డక్కన్ క్రానికల్ కోసం ఆసక్తిని చూపాయి.

వీటితో పాటు టీవీ9కు చెందిన ఐ ల్యాబ్‌ హైదరాబాద్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏసియానెట్‌ న్యూస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌ టెయిన్ మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లు బిడ్లు సమర్పించాయి. ఇక ఈ కంపెనీలతో పాటు అస్సెట్‌ రీ-కన్‌ స్ట్రక్షన్‌ కంపెనీ ఇండియా లిమిటెడ్‌, ఎస్‌ఆర్‌ఈఐ మల్టిపుల్‌ అస్సెట్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ట్రస్ట్‌, విజన్‌ ఇండియా ఫండ్‌, ఫ్యూచర్‌ గ్రేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌, అడోనిస్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు కూడా ఆసక్తిని చూపినట్టు తెలుస్తోంది. ఇక ఈ కంపెనీల్లో ఏది విజయం సాధించి, దక్షిణ భారతావనిలో ఆంగ్ల పత్రికల్లో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న 'డీసీ'ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

More Telugu News