Bengalore: బెంగళూరులో అదృశ్యమైన యువతి కోసం మ్యాసివ్ సెర్చ్!

  • గత వారంలో అదృశ్యమైన ఆత్రేయీ మజుందార్
  • స్టార్ హోటళ్ల సెక్యూరిటీ కెమెరాల్లో కనిపించిన వైనం
  • ఆపై న్యూఢిల్లీలో ఉన్నట్టు సమాచారం
  • ఆచూకీ కోసం శ్రమిస్తున్న పోలీసులు, బంధుమిత్రులు

బెంగళూరులో గతవారం అదృశ్యమైన ఆంత్రోపాలజిస్ట్ ఆత్రేయీ మజుందార్ (35) ఆచూకీ కోసం పోలీసులు, ఆమె మిత్రులు భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టగా,వారికి గూగుల్ సాయపడుతోంది. ఈనెల 4వ తేదీన కెనడా నుంచి వచ్చిన ఆమె, అదే రోజు రాత్రి 9 గంటల వరకూ ఇంట్లోనే ఉండి, ఆపై కనీసం హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోకుండా బయటకు వెళ్లిన ఆత్రేయి ఇంటికిక తిరిగి రాలేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె బెలందూరులోని నోవాటెల్, మారియట్ హోటళ్ల సెక్యూరిటీ ఫుటేజ్ లో కనిపించినట్టు తేల్చారు. తన ఫోన్ ను ఇంట్లోనే వదిలివెళ్లిన ఆత్రేయి, పాస్ పోర్టును, నగదును తీసుకుని ఇంటి నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది.

 ఆమె ఎక్కడుందన్న విషయాన్ని కనుగొనేందుకు స్నేహితులు, సహోద్యోగులూ గూగుల్ స్ప్రెడ్ షీట్ ను ఉపయోగిస్తున్నారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ లో విద్యను అభ్యసించిన ఆమె, ఆపై రీసెర్చ్ కోసం టొరంటోకు వెళ్లారు. ఆమె ఇంటి నుంచి వెళ్లిన ఓ రోజు తరువాత తాను న్యూఢిల్లీలో ఉన్నట్టు ఫోన్ చేసి చెప్పిందని, ఆ వెంటనే తాను బెంగళూరుకు వచ్చేయాలని చెప్పానని ఆత్రేయి తండ్రి వెల్లడించారు. ఇక ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ, ఆమె ఎవరికి కనిపించినా తెలియజేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. బెంగళూరు నుంచి ఆత్రేయి న్యూఢిల్లీకి ఎందుకు వెళ్లిందన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.

More Telugu News