Chennai: చేపాక్ స్టేడియంలో రెచ్చిపోయిన నిరసనకారులు.. రవీంద్ర జడేజాపైకి బూట్లు

  • ఆటకు అంతరాయం కలిగించాలని చూసిన టీవీకే కార్యకర్తలు
  • మ్యాచ్‌కు ముందే హెచ్చరించిన నేత
  • నలుగురి అరెస్ట్

ఐపీఎల్‌లో భాగంగా చేపాక్ స్టేడియంలో మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ -కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. కావేరీ జల వివాదం నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ నిరసనకారులను నియంత్రించలేకపోయారు. ‘నామ్ తమిళియర్ కచ్చి’ కార్యకర్తలు ఆటకు అంతరాయం కలిగించాలని చూశారు. అందులో భాగంగా మైదానంలోకి బూట్లు విసిరారు. లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా లక్ష్యంగా బూట్లు విసరగా, అవి గురి తప్పి బౌండరీ లైన్ వద్ద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఎంగిడి ఉన్నారు. దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.  ఈ ఘటనలో మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చేపాక్‌లో మ్యాచ్ ఆడనిచ్చేది లేదని టీవీకే నేత వేల్‌మురుగన్ మ్యాచ్‌కు ముందే హెచ్చరించారు. మైదానంలో పాములు వదులుతామని హెచ్చరించారు. దీంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను కూడా స్టేడియంలోకి అనుమతించలేదు. అయితే నిరసనకారులు మాత్రం షూ విసిరి ఆటకు అంతరాయం కలిగించాలని చూశారు. కాగా, చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.

More Telugu News