టోర్నీ మారినా ఫార్ములా ఒక్కటే: ధావన్

10-04-2018 Tue 12:25
  • సఫారీతో సిరీస్ లో దూకుడు పెంచాను
  • శ్రీలంకతో సిరీస్ లో ఆ దూకుడు కొనసాగించాను
  • ఐపీఎల్ లో కూడా అలాగే ఆడుతాను

టోర్నీ మారినా తన ఫార్ములా మాత్రం మారలేదని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ తెలిపాడు. గత కొంత కాలంగా దూకుడే మంత్రంగా ఆడుతున్నానని తెలిపాడు. ఐపీఎల్‌ కెరీర్‌ లో 29వ అర్ధశతకం బాదిన అనంతరం ధావన్‌ మాట్లాడుతూ, క్రీజులో వీలైనంత ఎక్కువ సమయం నిలదొక్కుకోవాలని, క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నానని అన్నాడు.

తన ఫార్ములా ప్రస్తుతానికి ఇదేనని, ఇలా చేయడం వల్ల జట్టుతో పాటు తనకు కూడా మంచిదని చెప్పాడు. సఫారీ పర్యటనలో తన దూకుడు పెంచానని, దానినే శ్రీలంక పర్యటనలో కూడా కొనసాగించానని, ఇప్పుడు ఐపీఎల్ లో కూడా దానినే అనుసరిస్తున్నానని చెప్పాడు. సన్ రైజర్స్ జట్టు సమతూకంగా ఉందని చెప్పిన ధావన్, టోర్నీని విజయంతో ఆరంభించడం బాగుందని పేర్కొన్నాడు. ఈ విజయం జట్టులో విశ్వాసం నింపుతుందని, అది మిగిలిన మ్యాచ్ లపై ప్రభావం చూపుతుందని ధావన్ అభిప్రాయపడ్డాడు.