USA: ట్రంప్ దీర్ఘకాల లాయర్ పై ఎఫ్బీఐ దాడులు... పోర్న్ స్టార్ తో రాసలీలలపై రికార్డుల స్వాధీనం!

  • న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు
  • స్టార్మీ డేనియల్స్ తో లావాదేవీల రికార్డులు స్వాధీనం
  • అమెరికాపైనే దాడిగా అభివర్ణించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సుదీర్ఘకాలంగా న్యాయసేవలను అందిస్తున్న న్యాయవాది మైఖేల్ డీ కోహెన్ ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టార్గెట్ చేసుకుంది. గత రాత్రి నుంచి ఆయనకు చెందిన రాకీఫెల్లర్ సెంటర్ కార్యాలయం, పార్క్ ఎవెన్యూ హోటల్ గదుల్లో ఎఫ్బీఐ సోదాలు జరుపుతోంది. స్వయంగా అధ్యక్షుడి లాయర్లపై దాడులు ప్రారంభం కావడం యూఎస్ లో కలకలం రేపగా, ట్రంప్ తో తనకు వివాహేతర సంబంధముందని చెప్పిన పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో జరిపిన నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక దస్త్రాలను ఎఫ్బీఐ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఆమెకు ట్రంప్ నుంచి అందిన నగదుకు సంబంధించిన పత్రాలు కూడా వీటిల్లో ఉండటం గమనార్హం. ఇక తన న్యాయవాదిపై ఎఫ్బీఐ దాడులు జరపడంపై ట్రంప్ నిప్పులు చెరిగారు. ఇది కుట్ర పూరిత చర్యని, ఎఫ్బీఐ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన అభివర్ణించారు. సిరియాపై మరో క్షిపణిని ప్రయోగించే విషయంలో రక్షణ శాఖ అధికారులతో సమావేశమైన ట్రంప్, అంతకుముందు మాట్లాడుతూ, ఎఫ్బీఐ దాడులను అమెరికాపై జరిగిన దాడులుగా అభివర్ణించారు. కాగా, అక్రమ సంబంధాలు, చెప్పిన అబద్ధాలపై ట్రంప్ కు కష్టాలు పెరగనున్నాయని, ఇవి ఆయనను పదవీచ్యుతుడిని చేయవచ్చని యూఎస్ న్యూస్ చానల్స్ అభిప్రాయపడుతున్నాయి.

More Telugu News