leopard: తమ ప్రాణాలను పణంగా పెట్టి చిరుత ప్రాణాలు కాపాడిన యువకులు!

  • స్పృహ తప్పిన చిరుతను బైక్‌పై ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
  • తమ ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా సాహసం చేసిన వైనం
  • కోలుకుంటున్న చిరుత.. సిబ్బందిపై ప్రశంసల వర్షం

అటవీశాఖకు చెందిన ముగ్గురు సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి చిరుత ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఆదివారం ఉదయం కొందరు యువకులు గోరఖ్‌పూర్ దక్షిణ చౌక్ రేంజ్ అటవీ ప్రాంతం గుండా బైక్‌పై వెళ్తుండగా పోతనుల్లా సమీపంలోని టాంజియా 28 నర్సరీలో ఓ చిరుత పులి స్పృహ తప్పి పడిపోయి కనిపించింది. వారు ఆ విషయాన్ని వెంటనే రేంజర్ దయాశంకర్ తివారీకి ఫోన్ చేసి విషయం చెప్పారు. కుశ్వాహ, వీరేందర్, మోబిన్ అలీ అనే ఇద్దరు సిబ్బందితో కలిసి వచ్చిన రేంజర్ విషయాన్ని డీఎఫ్‌వో మనీష్ సింగ్‌కు చేరవేశారు.

చిరుతను ఆసుపత్రికి తరలించేందుకు అర్జెంటుగా బోను పంపాలని కోరారు. అయితే, అప్పటి వరకు ఆగితే చిరుత ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని గ్రహించిన సిబ్బంది దానిని బైక్‌పై సమీపంలోని పట్టణానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ చిరుత కోలుకుందని, ఆహారం తీసుకుందని దక్షిణ్ చౌక్ రేంజ్ డీఎఫ్‌వో మనీష్ సింగ్ తెలిపారు. ఈ ప్రాంతంలో చిరుతలు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.

చిరుతను ఆసుపత్రికి తరలించిన సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. వారు తమ ప్రాణాలకు తెగించి చిరుతను తీసుకెళ్లారన్నారు. ఆసుపత్రికి తరలించే సమయంలో చిరుతకు మెలుకువ వచ్చి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు.

More Telugu News