Alwar: పిల్లలను ఆకర్షించేందుకు రైలుబండిలా మారిన ప్రభుత్వ పాఠశాల!

  • రైలు బండి ఆకారంలోకి మారిపోయిన స్కూలు
  • చదువుకునేందుకు ఎగబడుతున్న విద్యార్థులు
  • ఒక్క ఆలోచనతో మారిపోయిన స్కూలు భవనం

ఉదయం 8 గంటలైందంటే చాలు.. ఆ రైలు పెట్టెలో విండో సీట్ల కోసం విద్యార్థులు పరుగులు పెడతారు. ఇంటర్వెల్ సమయంలో ఫ్లాట్ ఫాంపైకి వచ్చి సరదాగా గడుపుతారు. కంపార్ట్‌మెంట్లలో అటూ ఇటూ చక్కర్లు కొడతారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ కూడా బోగీల్లోనే ఉంటారు. విద్యార్థులేంటి? రైలేంటి? అన్న సందేహం వస్తే రాజస్థాన్‌లోని అల్వార్  ప్రభుత్వ పాఠశాల గురించి తెలుసుకోవాల్సిందే.

ఇక్కడి సీనియర్ సెకండరీ స్కూలు ఒకప్పుడు అన్ని పాఠశాలల్లానే ఓ పాత భవనంలో ఉండేది. అయితే, ప్రస్తుతం ఆ స్కూలు సరికొత్త రూపును సంతరించుకుంది. విద్యార్థులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కారణం.. స్కూలు మొత్తం రైలు పెట్టెలా మారిపోవడమే. ఇంజిన్, ప్లాట్‌ ఫ్లాం సహా స్కూలు స్వరూపాన్ని మొత్తం రైలు బండిలా మార్చేశారు. ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్, ప్రిన్సిపాల్ గది, ప్లాట్‌ఫ్లాం.. అన్నీ  రైలు బండి ఆకారంలోకి మారిపోయాయి. ఎవరైనా కొత్తవారు వచ్చి చూస్తే అది నిజమైన రైలు బండే అనుకునేంతలా దానిని తీర్చిదిద్దారు. దీంతో ఇప్పుడు ఇందులో చదువుకునేందుకు పిల్లలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

పిల్లలకు రైలు ప్రయాణమంటే సరదా అని, అందుకే స్కూలు భవనాన్ని రైలు బండిలా మార్చేశామని ప్రిన్సిపాల్ పురుషోత్తం గుప్తా తెలిపారు. ప్రభుత్వ స్కూలు భవనాలన్నింటినీ ఇలా ఆకర్షణీయంగా మార్చాలని అన్నారు. కేరళలోని ఓ ప్రభుత్వ స్కూలు రైలు కోచ్‌ ఆకారంలో ఉండడాన్ని చూసిన జిల్లా సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) జూనియర్ ఇంజినీర్ రాజేశ్ లావానియాకు అల్వార్ స్కూలును మొత్తం రైలు బండిలా మార్చాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ప్రస్తుత స్కూలు భవనం!

More Telugu News