ఐపీఎల్ లో బోణీ కొట్టిన ఎస్ఆర్ హెచ్... అలవోకగా విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాదు

10-04-2018 Tue 07:41
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • కెప్టెన్సీతో ఆకట్టుకున్న కేన్ విలియమ్సన్
  • ధాటిగా ఆడిన శిఖర్ ధావన్

ఐపీఎల్‌ సీజన్–11లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు శుభారంభం చేసింది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన సన్ రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు బ్యాటింగ్ కు దిగింది. కీలక సమయాల్లో బౌలర్లను మార్చుతూ, బౌలర్లకు అనుగుణంగా ఫీల్డర్లను సెట్ చేస్తూ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆకట్టుకున్నాడు.

సన్ రైజర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన వార్నర్ లేని లోటును విలియమ్సన్ ఏమాత్రం కనబడనివ్వలేదు. మెరుపువేగంతో ఒక రనౌట్ కూడా చేసి ఔరా అనిపించాడు. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. సంజు శామ్సన్‌ (49) ఒంటరిపోరాటంతో ఆ జట్టు ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ సాహా(5) వికెట్ కోల్పోయింది. రహానే ఇచ్చిన లైఫ్ ను వినియోగించుకున్న ధావన్ (77) ధాటిగా ఆడగా, అతనికి జత కలిసిన విలియమ్సన్ (36) నిలకడ ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు కేవలం 15.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 127 పరుగులు చేసి అలవోక విజయాన్ని నమోదు చేసింది.