నీరవ్ కుంభకోణానికి భయపడక్కర్లేదు.. మన బ్యాంకింగ్‌ వ్యవస్థ చాలా గట్టిది!: బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్

10-04-2018 Tue 07:22
  • నీరవ్ కుంభకోణంపై ఆందోళన అవసరం లేదు
  • భారతీయ బ్యాంకుల్లో కావాల్సినంత డబ్బు ఉంది
  • కుంభకోణాల భారం వినియోగదారులపైనే పడుతుంది
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణంపై అనవసరంగా ఆందోళన చెందుతున్నారని, అంత భయపడాల్సిన అవసరం లేదని బాంబే స్టాక్‌ ఎక్స్‌ ఛేంజ్‌ (బీఎస్ఈ) సీఈవో అశిష్‌ చౌహాన్ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటి)కి చెందిన ఇండియా స్టూడెంట్స్ వార్షికోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీరవ్‌ చేసిన మోసం భారతీయ బ్యాంకింగ్‌ సెక్టార్‌ లో కేవలం మూడు రోజుల వడ్డీతో సమానమని అన్నారు. 1992లో హర్షద్‌ మెహతా కుంభకోణం బయటపడినప్పుడే ఆర్బీఐతో పాటు భారతీయ బ్యాంకింగ్‌ రంగం పలు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి మోసాలు వెలుగు చూసి ఉండేవి కాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అలాంటి మోసాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

 భారత్ బ్యాంకింగ్‌ రంగం పరిమాణం కోటి కోట్ల రూపాయలని ఆయన తెలిపారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వారి నుంచి ఏటా 12% వడ్డీ వసూలు చేస్తాయని ఆయన చెప్పారు. అదే సమయంలో బ్యాంకుల్లో డబ్బు దాచుకునే వినియోగదారులకు కేవలం 4% వడ్డీని మాత్రమే ఇస్తారని ఆయన తెలిపారు. అంటే రుణాల నుంచి బ్యాంకులు వసూలు చేసే వడ్డీలో 8% బ్యాంకులకే మిగులుతాయని ఆయన వెల్లడించారు. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ చాలా గట్టిదని తెలిపిన ఆయన, ఊహించనివి ఏవైనా జరిగితే కాపాడుకునేందుకు బ్యాంకుల వద్ద కావాల్సినంత డబ్బు ఉందని అన్నారు.

ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు బ్యాంకులు వినియోగదారుల నుంచి కొంత మొత్తం కవర్ చేసుకునేలా చూస్తాయని, అందులో భాగంగా బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారికి సాధారణంగా ఇచ్చే 4% వడ్డీ కాకుండా 3% వడ్డీని మాత్రమే ఇస్తాయని ఆయన స్పష్టం చేశారు. కనుక భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కాగా, పీఎన్బీ మోసం కేసులో నీరవ్‌ మోదీ, అతని మేనమామ మేహుల్‌ చోక్సీకి సీబీఐ న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. నీరవ్ హాంగ్ కాంగ్ లో ఉన్నాడని గుర్తించి, అతనిని స్వదేశం రప్పించేందుకు చర్యలు చేపడుతున్న సంగతి కూడా తెలిసిందే.