Ambedkar: విగ్రహాలను యూపీ పోలీసులు ఇలా రక్షిస్తున్నారు!

  • ఇటీవల వరుసగా ధ్వంసమవుతున్న విగ్రహాలు
  • ప్రముఖుల విగ్రహాల రక్షణకు హోంశాఖ చర్యలు
  •  విగ్రహాల చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయాలంటూ పోలీసులకు ఆదేశం

దేశంలో ఎవరికి కోపం వచ్చినా తొలుత పగిలిపోయేవి విగ్రహాలే. ఇటీవల ఇటువంటి చర్యలు మరింత ఎక్కువయ్యాయి. విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా అల్లర్లకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ హోంశాఖ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. విగ్రహాలను రక్షించుకునేందుకు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రముఖుల విగ్రహాల చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించినట్టు హోంశాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.

మహాత్మాగాంధీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఈవీ రామస్వామి పెరియార్, లెనిన్ విగ్రహాలపై ఇటీవల దాడులు జరిగాయి.  తాజాగా శనివారం మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా ఖేరియాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాజస్థాన్‌లోని అక్రోల్‌లోనూ రాజ్యాంగ నిర్మాత విగ్రహంపై దుండగులు ప్రతాపం చూపారు.

త్రిపురలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత విగ్రహాల ధ్వంసం ఘటనలు ఎక్కువయ్యాయి. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ కార్యకర్తలుగా చెబుతున్న కొందరు త్రిపురలో కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో సీపీఎం-బీజేపీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రముఖుల విగ్రహాల చుట్టూ ఆందోళనకారులు చొరబడకుండా పటిష్టమైన ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.

More Telugu News