GHMC: హైదరాబాద్ లో తగ్గని వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం... జనజీవనంపై ప్రభావం!

  • ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్
  • పల్లపు ప్రాంతాల్లోకి చేరిన నీరు
  • రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ

ఈ తెల్లవారుజామునుంచి కురుస్తున్న వర్షం ఏ మాత్రమూ తెరపివ్వక పోవడంతో హైదరాబాద్ నగరంలో జనజీవనంపై ప్రభావం పడింది. ఆదివారం కావడంతో స్కూళ్లు పనిచేయక పోవడంతో, విద్యార్థులకు ఇబ్బందులు లేకపోయినా, వివిధ పనులపై బయటకు వచ్చే వారు ట్రాఫిక్ జామ్ లలో ఇరుక్కుంటున్నారు. కురుస్తున్న వర్షంలోనే తడుస్తూ తమ పనులను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఉదయం 9 గంటల వరకూ హైదరాబాద్ లో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రామాంతపూర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపునీరు ప్రవేశించింది. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. మ్యాన్ హోల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అన్నారు. కాగా, మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

More Telugu News